మేము వస్తాం.. వడ్డీతో సహా చెల్లిస్తామని బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికీ తప్పుడు పనులు, మాటలు మానుకోవడం లేదు. వారికి అర్థం కాని విషయం ఏమిటంటే.. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కన్నూమిన్నూ కానరాకుండా చేసిన దానికే ఇప్పుడు అనుభవిస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు రోడ్డున పడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలా అనుకుంటున్నారు కానీ.. అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటికే ఇప్పుడు అనుభవిస్తున్నారన్న విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు.
ఐదేళ్ల అరాచకాల పాపాలకే నేడు కష్టాలు
రోజా ఐదు సంవత్సరాల పాటు ఏం చేశారు ?. అందిన కాడికి దోచుకుని .. చంద్రబాబు, పవన్, నారా లోకేష్ సహా ఎవర్నీ వదిలి పెట్టకుండా జగనన్న మనసు రంజింపజేసిన చేసేలా బూతులు తిట్టి టైం పాస్ చేశారు. ఇప్పుడు పదవి పోయినా ఆమె తగ్గడం లేదు. మహిళా నేతలపై కఠిన చర్యలు వద్దని చంద్రబాబు సూచించిన విషయం తెలిసిన తర్వాత ఆమె ఆగడం లేదు. అదే అడ్వాంటేజ్ తీసుకుని మళ్లీ అందరిపై విరుచుకుపడుతున్నారు. నా కొడుకులు అనే పదజాలాన్ని కూడా ఎమ్మెల్యేలందరిపై వాడుతున్నారు. ఒక్క రోజా కాదు.. మేము మళ్లీ వస్తే నరికేస్తాం అని బెదిరిస్తున్న వారంతా.. గతంలో తాము చేసిన తప్పులకు ఎక్కడ చర్యలు తీసుకుంటారోనన్న భయంతోనే. చివరికి జగన్ కూడా.
ఐదు సంవత్సరాల పాటు చేసింది అంతా మరచిపోతారా ?
చరిత్రలో చాలా పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ ఒక్క వైసీపీ మాత్రమే ఘోరమైన పరిపాలన చేసింది. ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టారు. దాడులు చేశారు. కేసులు పెట్టారు. ఎవర్నీ వదల్లేదు. ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంత ఘోరమైన పరిపాలన చేసి.. ఓడిపోయాక తమ జోలికి వస్తే.. అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. భయ పెట్టి తమ జోలికి రాకుండా చేసుకోవాలన్న ప్లానే. కానీ చట్ట ప్రకారం జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయి. ఇలాంటి బెదిరింపులు ఆపగలవా ?
తప్పులు చేసి …కేసులు పెట్టకూడదంటే ఎలా ?
అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నారు. దాడులు చేశారు. ఇప్పుడు కేసులు పెట్టకూడదని వైసీపీ నేతలంటున్నారు. అలా పెడితే తాము అధికారంలోకి వచ్చాక రప్పా..రప్పా నరికేస్తామంటున్నారు. కొంత మంది సైలెంటుగా చీకట్లో చంపేసి ఉదయమే పరామర్శిస్తామని కూడా అంటున్నారు వీరి వ్యవహారంలో మొత్తం రాజకీయమే కలుషితం అయిపోయింది. ఈ బెదిరింపులకు వ్యవస్థలు లొంగవని వారికి అర్థం కావడం లేదు.