వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో నకిలీ మద్యం దందా విచ్చలవిడిగా జరిగింది. ఐదు సంవత్సరాల పాటు మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుకున్నారు. ఓ వైపు ప్రభుత్వం జే బ్రాండ్స్ అమ్ముతూంటే మరో వైపు ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ నకిలీ మద్యం తయారు చేసి అమ్మారని జోగి రమేష్ వంటి వారి ఉదంతంలో స్పష్టమవుతోంది. ఇలాంటి కల్తీ మద్యం వల్ల 2022లో తాడేపల్లిగూడెంలో పాతిక మంది చనిపోయారు. అప్పట్లో అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నించినా తప్పుడు నివేదికలతో ఎదురుదాడి చేశారు. గట్టిగా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ విచారణ చేయడంతో అవి కల్తీ మద్యం మరణాలేనని బయటపడింది. నివేదిక ప్రభుత్వానికి అందింది.
కల్తీ మద్యం కారణంగా వారంలో 25 మంది మృతి
2022 మార్చి నెలలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒకే వారంలో సుమారు 25 మందికి పైగా మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. మరణించిన వారంతా పేద కార్మికులు , రోజువారీ కూలీలు. వీరంతా స్థానికంగా లభించే మద్యం, నాటు సారా తాగిన తర్వాతే కడుపునొప్పి, వాంతులు, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలతో మరణించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మరణాలను కల్తీ మద్యం మరణాలు గా గుర్తించడానికి నిరాకరించింది. అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వం వివరణ ఇస్తూ.. చనిపోయిన వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గుండెపోటు లేదా వృద్ధాప్య కారణాల వల్ల చనిపోయారని పేర్కొంది.
బాధ్యత మరిచి పేదల ప్రాణాలను లైట్ తీసుకున్న వైసీపీ ప్రభుత్వం
పేదలు పిట్టల్లా రాలిపోతున్నారని తెలుస్తున్నా ప్రభుత్వం బాధ్యత మర్చిపోయింది. కుట్ర పూరితంగా అవి కల్తీ మద్యం కారణాలు కాదని చెప్పేందుకు తప్పుడు నివేదికలు రెడీ చేయించారు. కొన్ని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు, రిపోర్టుల్లో ఎక్కడా విషపూరిత పదార్థాలు ఉన్నట్లు ఆధారాలు లేవని నివేదికలు ఇచ్చారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పట్లో విచారణను నీరుగార్చారని ఆరోపిస్తూ, కూటమి ప్రభుత్వం ఇప్పుడు సిట్ తో పూర్తి పరిశీలన చేయించింది. గతంలో సరఫరా చేసిన మద్యం శాంపిల్స్‌ను సేకరించి, వాటిలో హానికరమైన కెమికల్స్ ఉన్నాయా అనే కోణంలో ల్యాబ్ పరీక్షలు జరిపింది.
అవి కల్తీ మద్యం మరణాలే -ఇప్పుడెలాంటి చర్యలు తీసుకోగలరు?
ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసిన గత ప్రభుత్వ నిర్వాకాన్ని సిట్ బయట పెట్టింది. ఆ కల్తీ మద్యం శాంపిళ్లను సేకరిచింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయగలదన్నది ప్రశ్న. అప్పట్లో సహజ మరణాలుగా కేసులను మూసివేసిన అధికారులపై విచారణ జరిపి, తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పటికే చాలా మంది అధికారులు కూటమి ప్రజాప్రతినిధులతో సన్నిహితం అయ్యారు. ఆ పని కూడా చేయలేరు. కల్తీ మద్యాన్ని తయారు చేసిన వారనీ పట్టుకోలేరు. కేవలం నాటి ప్రభుత్వ వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది. చట్టపరంగా ముందు కెళ్లడం కష్టమే.
