ఓటుకి నోటు కేసు ప్రస్తావన వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా గుర్తుకు రావడం చాలా సహజం అయిపోయింది. ఆ రెంటికీ సంబందం లేకపోయినా వాటి మద్య ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలుసు గనుకనే అది కూడా గుర్తుకొస్తుంది. మళ్ళీ ఓటుకి నోటు కేసులో కదలిక రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మళ్ళీ మాటలు వినబడుతున్నాయి.
తెదేపా అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు ఆ ప్రస్తావన చేశారు. ఇటువంటి కేసులలో ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు. ఒక ప్రభుత్వంపై మరో ప్రభుత్వం ఈవిధంగా నిఘా పెట్టడం, ఫోన్ ట్యాపింగ్ లకి పాల్పడటం చాలా దారుణం అని అన్నారు. తెలంగాణాలో వైకాపాతో సహా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని తెరాస ప్రలోభపెట్టి పార్టీలు ఫిరాయింపజేస్తుంటే నోరు మెదపని వైకాపా, చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టి, జైలుకి పంపాలని చేతిలో ఉన్న సాక్షి మీడియాలో తెగతెంపులు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుపై ఎవరు తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళే జైలుకి వెళతారని జూపూడి హెచ్చరించారు.
ఆయన వైకాపాని ఉద్దేశ్యించి మాట్లాడినట్లు పైకి కనిపిస్తున్నా ఆ హెచ్చరికలు తెలంగాణా ప్రభుత్వానికేనని అర్ధం అవుతూనే ఉంది. ఒకవేళ ఓటుకి నోటు కేసులో తెలంగాణా ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసుని అటక మీద నుంచి దింపుతుందని జూపూడి హెచ్చరిస్తున్నట్లుగా భావించవచ్చు. అయితే ఇదివరకు ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా తీవ్ర స్థాయిలో ఘర్షణ పడినప్పుడే ఈ కేసులు ముందుకు కదలలేదు కనుక ఇప్పుడు ఏదో జరిగిపోతుందని ఊహించుకోవడం అనవసరమే. మళ్ళీ ఏదో ఒక దశలో ఈ కేసుకి బ్రేకులు పడటం తధ్యం.
ఈ కేసుని త్రవ్వి తీయడం వలన వైకాపాకి ఒరిగేదేమిటంటే ఈ కేసు పేరు చెప్పుకొని తెదేపాపై దాని అధినేత చంద్రబాబు నాయుడుపై బురద జల్లి సంతృప్తిపడగలదు. కానీ ఒకప్పుడు తెదేపాని ఇదేవిధంగా రెచ్చగొట్టినందుకు ఏకంగా 20మంది ఎమ్మెల్యేలని పోగొట్టుకొన్న సంగతి మరిచిపోయి మళ్ళీ రెచ్చగొట్టి తప్పు చేసింది. కనుక తెదేపా కూడా దానిపై ప్రతీకారం తీర్చుకోకుండా విడిచిపెట్టకపోవచ్చు. వైకాపా మళ్ళీ బారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు. అందుకు అది కూడా సిద్దపడి ఉంటే మంచిది.