కింజరాపు కుటుంబీకుల స్వగ్రామం నిమ్మాడలో వైసీపీ మద్దతుదారుగా అప్పన్న అనే అభ్యర్థి నామినేషన్ వేయడానికి ప్రయత్నించడం.. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలతో అచ్చెన్నను అరెస్ట్ చేయడం సంచలనాత్మకం అయింది. వైసీపీకి నిమ్మాడలో కార్యకర్తలు కూడా లేరు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి అక్కడ ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం రెండు వేల రెండు వందలకుపైగా ఓటర్లు ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా టీడీపీకి అక్కడి గ్రామస్తులు ఓట్లు వేస్తూంటారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆరు ఓట్లు రాగా ఇతరులకు తొమ్మిది ఓట్లు వచ్చాయి.
అలాంటి చోట వైసీపీ మద్దతుదారుగా అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. కానీ.. కింజరాపు కుటుంబంలో వచ్చిన విబేధాలను వైసీపీ అనుకూలంగా మార్చుకుంది. ఎర్రన్నాయుడు సోదరుని కుమారుడు కింజరాపు అచ్చెన్న అనే యువకుడ్ని వైసీపీ టెక్కలి ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పిలిపించి మాట్లాడారు. దాంతో ఆయన బరిలో ఉండటానికి సిద్ధపడ్డారు. నామినేషన్ వేయనివ్వరని గుర్తించి.. నిమ్మాడకు దువ్వాడ శ్రీనివాస్ బయట నుంచి వ్యక్తుల్ని తీసుకుని వచ్చి హల్ చల్ చేశారు. అప్పన్న తమ మాట వినడం లేదని.. అచ్చెన్నే నచ్చచెప్పాలని.. ఆయన ఇంటికి అప్పన్న తండ్రి సోదరుడు వెళ్లారు. ఆ సమయంలో ఫోన్ చేసినప్పుడు అచ్చెన్న మాట్లాడారు. అందులో ఎక్కడా బెదిరించినట్లుగా లేదు. అయినప్పటికీ.. బెదిరించారంటూ కేసు పెట్టారు. ఇక అప్పన్న కూడా అప్పట్నుంచి గ్రామంలో లేరు.
వైసీపీ నేతల సమక్షంలో ఉన్నారు. నిమ్మాడలో పర్యటించాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకున్న తర్వాత అచ్చెన్నను అరెస్ట్ చేశారు. అయితే.. నిమ్మాడకు వెళ్లలేదు. కారణం ఏంటో తెలియదు కానీ.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఇంట్లో ఉన్న అప్పన్నను విజయసాయిరెడ్డి పరామర్శించి వెనుదిరిగారు. మొత్తానికి కింజరాపు కుటుంబంలో రాజకీయ ఆశలు ఉన్న కొంత మందిని బయటకు లాగి… కుటుంబంలో చిచ్చు పెట్టేసి.. అచ్చెన్నను టార్గెట్ చేశారన్న ఆరోపణలను టీడీపీ నేతలు వినిపిస్తున్నారు.