అనర్హతా వేటు పడితే మొత్తానికే మోసం వస్తుందని ఒక్క సీటు గెలవలేమని భయపడుతున్న జగన్ .. చివరికి ఎమ్మెలందర్నీ అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం బెంగళూరుకు బయలుదేరే ముందు తాడేపల్లి నివాసంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో .. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతారని.. జగన్ వారి కోరికను మన్నిస్తారని.. అందర్నీ సమన్వయం చేసే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇస్తారని వైసీపీ వర్గాలు లీక్ చేశాయి.
ఒక్క జగన్ మినహా ఎవరూ అసెంబ్లీకి వెళ్లకూడదని అనుకోవడం లేదు. సభకు వెళ్లి తమ బాధ్యతల్ని నిర్వర్తించానే అనుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం వద్దని చెబుతున్నారు. ఇప్పటి వరకూ అలా ఆపారు. కానీ ఇప్పటికే అనర్హతా వేటు పొంచి ఉంది. అదే సమయంలో అసెంబ్లీకి వెళ్లకపోవడంపై ప్రజల నుంచి సానుకూలత లేదు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారన్న ఫీలింగ్ లో ప్రజలు ఉన్నారు. తర్వాత అయినా వారికి ప్రజల మద్దతు లభించే అవకాశం లేదు. ఇవన్నీ ఆలోచించి జగన్ రెడ్డి తన పట్టు వీడి ఎమ్మెల్యేలను మాత్రం సభకు పంపించాలని అనుకుంటున్నారు.
ఎమ్మెల్సీలు సభా కార్యక్రమాలకు యథావిధిగా హాజరవుతున్నారు. అందుకే శాసనసభాపక్షం సమావేశంలో…. ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాన్ని చెప్పి జగన్ బెంగళూరు వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే జగన్ మనస్థత్వం ప్రకారం.. అసెంబ్లీలో ఎవరైనా సభ్యుడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటే సహించలేరు. అందుకే ఎమ్మెల్యేలు వెళ్లినా.. ఆయన మధ్యలో కలుగచేసుకుని ఇక వద్దని ఆపేస్తారని కొంత మంది నమ్ముతున్నారు.
