ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పద్దెనిమిదో తేదీ నుంచి జరగనుంది. గవర్నర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలు అంటే అందరికీ గుర్తు వచ్చేది వైసీపీ సభ్యులే. వారు వస్తారా రారా అన్నదానిపై చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి కారణం వారంతా అనర్హతా వేటుకు దగ్గరగా ఉండటమే.
అసెంబ్లీ చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సభ్యుడు వరుసగా 60రోజులు సభకు హాజరు కాకపోతే అసెంబ్లీ వారిపై అనర్హతా వేటు వేసి కొత్త సభ్యులను ఎన్నుకునే అవకాశం కల్పించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ప్రధాన విధి అసెంబ్లీకి హాజరుకావడం. దానికి మినహాయింపుల్లేవు. కానీ జగన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని.. అలాగైతేనే తన ఎమ్మెల్యేలు కూడా వస్తారని అంటున్నారు. ఎవర్నీ రానివ్వడం లేదు.
ప్రజల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉంది. వారిపై అనర్హతా వేటు వేసినా పెద్దగా వ్యతిరేకత ఉండదని భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు .. పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయని కూడా హెచ్చరించారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకూ నాలుగోసారి అసెంబ్లీ సమావేశం అవుతుంది. ఈ సమావేశాలతో అరవై రోజుల కోటా పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో గవర్నర్ ప్రసంగం రోజు జగన్ సహా పదకొండు మంది హాజరయ్యారు. కానీ అది బిజినెస్ డే కాదని అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. మరికొంత మంది సభకు రాకుండా దొంగతనంగా సంతకాలు పెట్టారు. అవి కూడా చెల్లవని స్పీకర్ చెప్పారు. అందుకే ఇప్పుడు వారికి లాస్ట్ చాన్స్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది.