ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి ఆసక్తికరంగా మారనున్నాయి. వైసీపీ అసెంబ్లీకి రాకపోవడంతో సభ జరుగుతున్నా ప్రజలకు పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఈ సారి మాత్రం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సంచలన నిర్ణయాలు తీసుకోవాలన్న ఆసక్తిలో ఉన్నారు. సభకు రాకుండా జీతం తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్ చాలా సార్లు ఇప్పటికే చెప్పారు. ఎథిక్స్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. కొంత మందిపై అనర్హతా వేటు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ వ్యూహాత్మకంగా ముందే రాజీనామాలు చేసి.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని నిరూపించే ప్రయత్నం చేయడం ఉత్తమం అన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.
రూల్స్ ప్రకారం వచ్చే సమావేశాల్లో అనర్హతకు అర్హత సాధించే వైసీపీ ఎమ్మెల్యేలు
జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ అంశం ఇటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. సభకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకోవడంపై ఎధిక్స్ కమిటీలోనూ చర్చ జరిగింది. చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పట్టుదలగా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ ద్వారా చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ పరిణామాలు వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
అసెంబ్లీకి ఎగ్గొట్టడం వల్ల అనర్హత పడితే అది ప్రజల్లో నగుబాటు
అసెంబ్లీకి రాకపోవడం వల్ల అనర్హత వేటు పడితే ప్రజలు బాధ్యతారాహిత్యంగా భావిస్తారు. అలా జరగకముందే వైసీపీ ఒక వ్యూహాత్మక అడుగు వేయడం సమంజసంగా ఉంటుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని నిరూపించడానికి, ప్రజా సమస్యల కోసం తాము సభను వదిలి వెళ్తున్నామని చెబుతూ ముందే రాజీనామాలు చేయడం ఒక బలమైన రాజకీయ అస్త్రం అవుతుంది. ఇది పార్టీలో ఉన్న స్తబ్దతను తొలగించి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం వైసీపీ కమ్ బ్యాక్ కు పునాది కాగలదు.
ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని జగన్ నమ్మకం
రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లడం ద్వారా, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. కేవలం సభను బహిష్కరించడం కంటే, రాజీనామాలు చేసి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లడం వల్ల పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవచ్చు. ఇది కేవలం ఒక నిరసనగా కాకుండా, ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంగా నిలుస్తుంది. రాజకీయాల్లో సమయం చాలా ముఖ్యం. ప్రభుత్వం అనర్హత వేటు వేసే వరకు వేచి చూడకుండా, సొంతంగా రాజీనామాలు చేయడం వల్ల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే కాకుండా, ప్రజల సానుభూతిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ దిశగా జగన్ అడుగులు వేస్తే, అది రాబోయే రోజుల్లో వైసీపీకి రాజకీయంగా పెద్ద మలుపు కావచ్చు. ఇది అంత రిస్క్ కాకపోవచ్చు.. ఎందుకంటే కూటమి గాలిలోనూ వాళ్లంతా గెలిచిన వాళ్లే. మరి జగన్ ధైర్యం చేస్తారా?