ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని రాజకీయ కారణాలతో బహిష్కరించిన పార్టీగా ప్రజల్లో ఛీత్కారాలను ఎదుర్కొంటున్న వైసీపీ.. తమపై ప్రజాగ్రహం వెల్లువెత్తే అవకాశాలను గుర్తించినట్లుగా కనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రతినిధి పని.. అసెంబ్లీకి హాజరై.. చట్టాలు చేయడంలో పాలు పంచుకోవడం.. తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడమే. బయట దందాలు చేసుకుంటామని.. రాజకీయాలు చేయడానికి ఎమ్మెల్యే పదవి అవసరం లేదు. బాధ్యతలు నిర్వహిస్తేనే పదవి ఉంటుంది. ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేల్లా ఎవరూ వ్యవహరించలేదు.ఇది వైపరీత్యం కిందకే వస్తుంది. అందుకే ప్రజలు కూడా వీరి గురించి ఆలోచించాల్సిన పరిస్థితిలో పడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై దేశవ్యాప్త చర్చ
జగన్ మోహన్ రెడ్డి తనకు అనుకూల మీడియాతో సమావేశం పెట్టినా.. వారు కూడా అసెంబ్లీకి ఎందుకు వెళ్లరని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లో ఓ జాతీయ మీడియాకు చెందిన రిపోర్టర్ ఇదే ప్రశ్న అడిగారు. ఇక్కడ ప్రెస్మీట్లు పెట్టి గంటల తరబడి మాట్లాడే బదులు ఆ చెప్పేదేదో అసెంబ్లీకే వెళ్లి చెప్పవచ్చు కదా అని అడిగితే జగన్ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. జాతీయ మీడియాలోనూ ఆయన వ్యవహారశైలి, చేస్తున్న రాజకీయంపై చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం లేని ఆయన రాజకీయాలపై విమర్శలు వస్తున్నాయి.
అనర్హతా వేటు వేసినా వ్యతిరేకత రానంతగా ప్రజల్లో చర్చ
అసెంబ్లీకి హాజరు కాని వాళ్లకు జీతభత్యాలు ఆపేయడం, అనర్హతా వేటు వేయడంపై సముచితమని.. ముఖ్యంగా.. సరైన కారణం లేకుండా.. చిన్నపిల్లల్లా చట్ట విరుద్ధమైన డిమాండ్లను పెట్టి.. అవి ఇస్తేనే వస్తామని మంకుపట్టు పట్టే రాజకీయ నేతలకు షాక్ ట్రీట్ మెంట్ అవసరమని భావిస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటివి పెరగకుండా ఉండాలంటే.. ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయుకండా శిక్షించాల్సిందేనన్న భావన ఉంది. అందులో భాగంగానే .. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఈ అంశాన్ని విస్తృతంగా చర్చల్లోకి పెడుతున్నారు. ప్రజల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ తీరుపై చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యేలను పంపే విషయంపై ఆలోచిస్తున్న జగన్
గతంలో పార్టీల అధినేతలు అసెంబ్లీని బహిష్కరించారు కానీ మొత్తం ఎమ్మెల్యేలు కూడా వెళ్లవద్దని ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ఆ తరహాలోనే జగన్ కూడా.. ఇప్పుడు తన విధానం మార్చుకుని పార్టీ ఎమ్మెల్యేలను పంపించాలని.. తాను మాత్రం దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. మాట్లాడే అవకాశం వస్తే తాము అసెంబ్లీకి వస్తామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఇప్పటికే మీడియాకు చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మాట్లాడే అవకాశం ఇస్తామని అంటున్నారు. వారు అసెంబ్లీకి వెళ్తేనే కదా మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో తెలిసేది. అందుకే.. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆయనకు ఓ ఆత్మన్యూనతాభావం ఉంది. అసెంబ్లీలో ఎవరైనా బాగా మాట్లాడితే.. తనను డామినేట్ చేశారనుకుంటారు. ఆ భావన పెరిగితే.. పంపినా డ్రామాలాడి బయటకు వచ్చేలా చేస్తారు.


