ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖలను సమర్పించినప్పటికీ, ఇంతవరకూ దానిపై లోక్ సభ స్పీకర్ స్పందించింది లేదు! ఎట్టుకేలకు ఇవాళ్ల స్పీకర్ స్పందించారు. వైకాపా ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిశారు. అనంతరం స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ… వైకాపా పార్లమెంటు సభ్యుల రాజీనామాలు భావోద్వేగ పూరితంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ఉద్వేగభరితమైన పరిస్థితుల నేపథ్యలోనే రాజీనామాలకు సిద్ధపడ్డట్టు అనిపిస్తోందన్నారు. లోక్ సభ స్పీకర్ గా వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం తనకు ఉందన్నారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాల్సిందిగా వారిని కోరినట్టు స్పీకర్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వంటి అంశాలపై వైకాపా ఎంపీలు భావోద్వేగాలతో ఉన్నారని స్పీకర్ చెప్పడం గమనార్హం! అయితే, వారు దాఖలు చేసిన రాజీనామా పత్రాల్లో అలా పేర్కొనలేదనీ చెప్పారు. సమస్యలను సభలో ప్రస్థావించే అవకాశం ప్రజలు ఇచ్చారనీ, పార్లమెంటులోనే పోరాటం చేయాలని తాను సూచించా అన్నారు. జూన్ 5 నుంచి 7 వరకూ మరోసారి కలవాలని చెప్పా అన్నారు. అప్పటికీ ఎంపీల వైఖరిలో మార్పు రాకపోతే ఆమోదించాల్సి వస్తుందన్నారు. కొంతమంది ఈ అంశాన్ని కర్ణాటక ఎంపీల రాజీనామాలతో ముడిపెడుతున్నారనీ, అక్కడి పరిస్థితులు వేరు అని స్పీకర్ వివరించారు.
వాస్తవానికి, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించాక… దానిపై ఇంతగా చర్చించాల్సిన అవసరం ఏముంటుంది..? ప్రత్యేక హోదా కోసమే రాజీనామాలు చేశామని కూడా రాజీనామా పత్రాల్లో వైకాపా ఎంపీలు పేర్కొనలేదని స్పీకరే చెబుతున్నారు. అలాంటప్పుడు, ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర అంశాలు వారిపై ప్రభావితం చేశాయని అనుకుంటున్నా అని వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏముంది..? వారి రాజీనామాలకు కారణం ఇదీ అని వారే లేఖలో చెప్పనప్పుడు, వారి మనసులోని మాట ఇదే అని మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా! పద్ధతిగా ఓసారి పిలిచి మాట్లాడాలి, మాట్లాడారు! అంతే తప్ప, వైకాపా ఎంపీల రాజీనామాల వెనక ఎంత కష్టముందో అని కనికరం చూపాల్సిన అవసరం స్పీకర్ కి ఏముంది..? వైకాపా ఎంపీలు ఎన్డీయే భాగస్వామ్య సభ్యులూ కారు, వారు దూరమైతే ప్రభుత్వం పడిపోతుందన్న భయమూ లేదు! అయినాసరే, కేంద్రం చేయాల్సినంత తాత్సారం చేస్తుండటం గమనార్హం.