అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని జగన్ రెడ్డి బయటకు చెబుతారు. కానీ పార్లమెంట్ లోకి వచ్చే సరికి వ్యతిరేకిస్తారు. బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు చర్చ సందర్భంగా వాకౌట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 చర్చ సందర్భంగా వైసీపీ నైజం బయటపడింది. బయట తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం వికేంద్రీకరణను మాత్రమే కోరుతున్నామని చెబుతున్న వైసీపీ నాయకత్వం, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టగానే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బిల్లు ఆమోద ప్రక్రియకు సహకరించకుండా సభ నుంచి వాకౌట్ చేయడం ద్వారా తమ వ్యతిరేకతను బహిరంగపరిచారు. ప్రస్తుత బిల్లు రూపంలో తమకు సమ్మతం కాదని.. అయితే అమరావతికి వ్యతిరేకం కాదని మిథున్‌రెడ్డి విచిత్ర వాదన చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ ఇలా చేయడం ఏమిటని ఇతర పార్టీల సభ్యులు కూడా విస్మయానికి గురి చేశారు.
వైసీపీ ఎంపీల ఈ చర్యపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఎన్డీయే నేతలు ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం పార్లమెంటరీ చట్టబద్ధత కల్పిస్తుంటే, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా అమరావతిపై వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు.

