జగన్ రెడ్డి .. విశాఖ పర్యటనకు వస్తున్నారు. తాను కట్టించలేకపోయిన.. మొండిగోడలు కూడా లేని మెడికల్ కాలేజీని పరామర్శించనున్నారు. ఆ కాలేజీని అమ్మేస్తున్నారని కన్నీరు కార్చనున్నారు. ఇదంతా రాజకీయం అనుకోవచ్చు కానీ.. ఈ పేరుతో ఆయన శాంతిభద్రతల సమస్యను సృష్టించాలనుకోవడమే వైసీపీకి పెద్ద సమస్యగా మారనుంది.
ఓదార్పుయాత్రల స్టైల్ – పాత చింతకాయపచ్చడి రాజకీయం
జగన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి ఓదార్పుయాత్రతో పునాదులు వేసుకున్నారు. తండ్రి చనిపోయిన రెండో రోజు నుంచే ఆయనకు ఓదార్పు యాత్ర ఆలోచన ఉందని.. సాక్షి పత్రికలో లెక్క కట్టి మరీ వేసుకున్న శవాల వివరాలతో ఎవరికైనా స్పష్టత వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ముంచేయడానికి సొంత పార్టీ పెట్టుకోవడానికి ఆయన ఈ శవయాత్రను వాడుకున్నారు. ఎక్కడికి వెళ్లినా…. రోడ్లపై బలప్రదర్శనలు చేసుకుంటూ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ఆ పద్దతి ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. పెళ్లికి వెళ్లినా జన సమీకరణ తప్పడంలేదు. కానీ ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయన్న విషయం జగన్ కు తెలియడం లేదు.
ఎంత మంది కార్యకర్తల ప్రాణాలు తీస్తారు?
అవసరం లేని హడావుడితో.. మీడియా, సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ ప్రచారం కోసం ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి.. కుప్పలు, కుప్పలుగా జనాలు వస్తున్నారని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి ఆత్రపడుతున్నారు. కానీ ఆయన ఆత్రాన్ని చూసి.. ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత పెంచడానికి చేయాల్సినంత చేస్తోంది టీడీపీ. గుంటూరు నుంచి సత్తెనపల్లి పోయే సమయంలో ఇద్దరి ప్రాణాలను తీసుకున్నారు. వారిని పట్టించుకోలేదు. ఆ ఘటన చేసిన డ్యామేజీ జగన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదు.
పోలీసులు అడ్డుకోరు మాస్టారూ.. అర్థంకాదా?
జగన్ రెడ్డి మాకవరంపాలెం పోవడానికి హెలికాప్టర్ లో పర్మిషన్ ఇచ్చారు. కానీ మీ పర్మిషన్ అక్కర్లేదు మేం రోడ్డు మార్గానే పోతామని ప్రకటిస్తున్నారు వైసీపీ నేతలు. పోలీసులు అడ్డు కోరు కూడా . ఈ మధ్యలో ఏమైనా జరిగితే.. వైసీపీ ప్రాణాలను తీయడానికే ఇలా చేస్తోందని విమర్శలు వస్తాయి. కరూర్ లో జరిగిన ఘటనతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ ప్రదర్శనలపై చర్చ జరుగుతోంది. ప్రజలు స్వచ్చందంగా వస్తారో… తోలుకొస్తారో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో… ఆలోచన లేకుండా ఆవేశానికి గురై ఏదో చేయాలనుకుంటే.. మొదటికే ఇరుక్కుపోతారు. కానీ ఆలోచించలేకపోతోంది వైసీపీ నాయకత్వం.