ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అధికారంలో ఉన్న పార్టీలను బట్టి మారిపోతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. దాడులు, దౌర్జన్యాలు హైలెట్ అవుతూ ఉంటాయి. తమను కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేతలు దాక్కోవాల్సి వచ్చేది. ఇళ్లపై పడి ధ్వంసం చేసినా కిక్కురుమనకుండా ఉండాలి. కానీ అదే చంద్రబాబు అధికారంలో ఉంటే.. అందరికీ ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది. ఎంతగా అంటే కుల చిచ్చులు పెట్టేందుకు ధైర్యంగా రాజకీయాలు చేసేస్తూంటారు. దానికి ఉదాహరణ.. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై దండయాత్ర
కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని అలా చేయడం ఏమిటని రామచంద్రయాదవ్ ఉద్యమం చేస్తున్నారు. తక్కెళ్లపాడు నుంచి పాదయాత్ర చేసి ఆయన .. ఎన్టీఆర్ విగ్రహాన్ని చెరువులో పడేస్తారట. క్యూఆర్ కోడ్లు పెట్టి మరీపోస్టర్లు వేసి పాదయాత్రకు వెళ్లబోతున్నారు. ఎన్టీఆర్ కృష్ణుడు కాదు.. కానీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఉండకూడదని ఎక్కడా లేదు. అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికైనా తెలుసా ?. రామచంద్ర యాదవ్ కు ఏమైనా తెలుసేమో కానీ.. ఎన్టీఆర్ రూపంలో కృష్ణుడు ఉండటం మాత్రం ఆయన మనోభావాలను దెబ్బతీస్తుందట.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నటుడికి కృష్ణుడి రూపం
ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో సినిమాలు చేశారు. నిజంగా కృష్ణుడికి రూపం ఉండి ఉంటే ఆయనలాగే ఉండేవారని అనుకుంటారు. అది తెలుగులో. కన్నడలో మరో నటుడు.. తమిళ్లో మరో నటుడు..హిందీలో మరో నటుడు ఇలాంటి వేషాలు వేస్తారు. కృష్ణుడి వేషం వేసే హక్కు అందరికీ ఉంటుంది. వారు ఆ రూపంలో విగ్రహాలు పెట్టుకోవడం తప్పు అని ఎవరూ చెప్పలేదు. ఖమ్మంలో అలాంటి విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు కోర్టు అభ్యంతరాలు చెప్పింది. కొన్ని మార్పులతో అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ కోర్టు ఆ ఆదేశాల పేరుతో రామచంద్ర యాదవ్ కుల చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయం చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి !
రామచంద్రయాదవ్ ఒకప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. తరవాత ఆ పార్టీ భరించలేకపోయింది. కానీ ఆయన ఏ వ్యాపారాలు చేస్తారో కానీ ధనబలం బాగానే ఉంది. అందుకే సొంత పార్టీ పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో పోటీ చేసి 300 ఓట్లు సాధించారు. పుంగనూరులో నాలుగు వేల ఓట్లకు పరిమితమయ్యారు. ఇప్పుడు కుల రాజకీయాలతోనే ఏదో చేద్దామని బయలుదేరారు. కృష్ణుడి రూపంలో ఎవరూ ఉండకూడదని లేదు.. వాళ్లే కృష్ణుడు అని చెప్పుకోలేరు. ఇలాంటి వాటితో రాజకీయాలు చేసి రామచంద్రయాదవ్ సాధించేదేమీ ఉండదు.