కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల క్షేత్రంపై వైసీపీ మూకలు చేస్తున్న రాజకీయం అసహ్యకరంగా మారుతోంది. ఐదేళ్ల పాలనలో అన్యమత ప్రచారం, డిక్లరేషన్ వంటి అంశాలపై అనేక విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే వింత పోకడలకు తెరలేపింది. తిరుమల కొండపై ఎక్కడో ఒక ఖాళీ మద్యం సీసా కనిపించినా, అలిపిరి వద్ద మాంసాహారం ఉన్నా, దారి పక్కన విరిగిపోయిన శిలలు కనిపించినా.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది , తిరుమల అపవిత్రమైంది అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తోంది. భక్తుల అత్యున్నత విశ్వాసాలకు కేంద్రమైన తిరుమలను రాజకీయ క్రీడకు వేదికగా మారుస్తున్నారు.
భూమన టీమ్స్ సృష్టించిన వివాదాలేనా?
ఇలాంటి ప్రచారాల వెనుక మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. భూమన ప్రత్యేకంగా కొన్ని టీములను ఏర్పాటు చేసి, కొండపై చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూపించడం లేదా కావాలనే అపవిత్రమైన వస్తువులను అక్కడ పడేసి వాటిని చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. గోశాలల నిర్వహణపై ఆయన చేసిన ఘోరమైన ఆరోపణలు, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యకలాపాలపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. కేసులు అయితే.. ఆయితే అడ్డగోలు వాదన చేసి తాను అలా అనలేదని చెప్పుకుంటున్నారు.
దేవుడితో చెలగాటం.. భక్తుల మనోభావాలపై దాడి
రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం, కానీ కోట్లాది మంది ఆరాధ్యదైవమైన వేంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని ఇందుకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కొండపైకి వచ్చే సామాన్య భక్తుల మనసుల్లో భయాందోళనలు కలిగించడం, క్షేత్ర పవిత్రతపై అనుమానాలు రేకెత్తించడం ద్వారా వైసీపీ ఏం సాధించాలనుకుంటోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లడ్డూ వివాదం సమయంలో తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చిన నేతలు, ఇప్పుడు చిన్న చిన్న అంశాలను రాజకీయం చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనంగా మారుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో గోశాల, సగం చెక్కిన శిల్పం, ఇతర అంశాల్లో చేసిన రచ్చ అంతా ప్రీప్లాన్డ్ అంటే ఎంత భారీ స్థాయిలో ఈ కుట్రలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం!
టీటీడీ అనేది ఒక స్వయంప్రతిపత్తి కలిగిన పటిష్టమైన వ్యవస్థ. అలిపిరి దగ్గర భద్రత నుంచి కొండపై పారిశుధ్యం వరకు వేలమంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తుంటారు. వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రచారం కేవలం ప్రభుత్వంపైనే కాకుండా, ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తోంది.
వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా.. ప్రజల్లో పట్టు కోల్పోయిన వైసీపీ, ఇప్పుడు దైవ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకోవాలని చూస్తోంది. అయితే, తిరుమల కొండపై జరిగే ప్రతి పరిణామాన్ని భక్తులు గమనిస్తూనే ఉంటారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు.
