జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా కార్యకర్తల్ని బలి చేస్తున్నారు. ఉన్మాదంగా అందరితో దాడులు చేయించేందుకు.. రప్పా రప్పా నరికేస్తామని బెదిరించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇలాంటి వారు కేసుల పాలవుతున్నారు. జగన్ రెడ్డి చేసిన నలుగైదు పర్యటనల కారణంగా నాలుగైదు వందల మంది కేసుల పాలయ్యారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన వారే. వారికి న్యాయసాయం కూడా అందడం లేదు. కానీ ఎక్కడికెళ్లినా కొంత మంది యువతను రెచ్చగొట్టి తప్పుడు పనులు చేయిస్తున్నారు. వారితో రాజకీయం చేసుకుంటున్నారు.
తోతాపురి డ్రామాలో మీడియాపై దాడులకు ప్రోత్సాహం
తోతాపురి మామిడికి మద్దతు ధర పేరుతో జగన్ వేసిన స్కిట్లో మీడియాపై దాడులకు ప్రోత్సహించడం విస్మయ పరుస్తోంది. డ్రామాలను బయట పెడతారని ఇతర మీడియా కెమెరాలు కనిపించకుండా చేసేందుకు ముందుగానే దాడులు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే కొంత మంది కార్యకర్తలకు ప్రత్యేకంగా ఆ బాధ్యతలు ఇచ్చారు. వారు దాడులు చేశారు. ఇప్పుడు వారు కేసుల పాలవుతారు. వారి కుటుంబాలు బాధపడతాయి. కానీ జగన్ రెడ్డి మాత్రం రాజకీయంగా లబ్ది పొందుతారు.
డీఎస్పీనే నరికేస్తామని హెచ్చరించే ఉన్మాదం
ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తల్ని అసాంఘిక శక్తులుగా జగన్ మారుస్తున్నారు. ముందస్తు డ్రామాలు ప్లాన్ చేసుకుని పోలీసుల్ని సైతం బెదిరించేందుకు వెనుకాడటం లేదు. రప్పా..రప్పా నరికేస్తామని.. పోలీసుల్ని సైతం బెదిరిస్తున్నారు. వారి చేతిలో ఆయుధం ఉంటే నరికేందుకు ప్రయత్నించేవాళ్లేమో కానీ పోలీసులు చూస్తూ ఉండరనే సంగతిని మరచిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఏం జరిగినా జగన్ రెడ్డికి కానీ ఆయన వెంట ఉండే నేతలకు కానీ పోయేదేమీ లేదు. భరించాల్సింది కార్యకర్తలే.
బలి పశువుల్ని చేస్తున్నారు.. బహు పరాక్
జగన్ తన పార్టీ కార్యకర్తల్ని బలి పశువుల్ని చేసి వారి పై నుంచి తన రాజకీయ యాత్రను కొనసాగించాలని అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం కార్యకర్తల్ని పట్టించుకోలేదు. అధికారం పోయాక…ఉన్మాద అభిమానంతో ఉండేవారిని సమీకరించి వారి భవిష్యత్ ను పెట్టుబడిగా పెట్టి రాజకీయాలు చేసుకుంటున్నారు. కార్యకర్తల్ని నిండా ముంచడం తప్ప వారికి ఉపయోగపడే పని ఏదీ చేయని జగన్.. లాంటి వారిని నమ్ముకుని తప్పుడు పనులు చేసి.. కుటుంబాలను ఇబ్బంది పెట్టడం కన్నా.. జగన్ కుట్రల్ని గుర్తించడం కార్యకర్తలకు అత్యవసరం.