ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంపై వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా , సోషల్ మీడియా వేదికగా బూతుల దాడులకు దిగినా.. వారు టార్గెట్ చేసిన కుట్రలు మాత్రం ఫలించడం లేదు. ఒక్క పనికి కూడా అడ్డం పడలేకపోతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మూలపడిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పట్టాలెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రజలపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని, దానికి నిదర్శనం రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న భారీ పెట్టుబడులే. ఒక్క పరిశ్రమను కానీ.. ఒక్క అభివృద్ధిపై కానీ జగన్ మార్క్ రాజకీయం పని చేయడం లేదు.
క్షుద్ర రాజకీయాలు చేస్తున్న వైసీపీ
జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు వ్యక్తిగత విమర్శలు, క్షుద్ర రాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటే, ప్రభుత్వం మాత్రం సంక్షేమం-అభివృద్ధి అనే రెండు చక్రాలపై పాలనను సాగిస్తోంది. గతంలో నిలిచిపోయిన అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులను పకడ్బందీగా గాడిలో పెట్టడమే కాకుండా, ఇచ్చిన హామీల మేరకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఒకవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, మరోవైపు రైతులకు, మహిళలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ సానుకూల వాతావరణం పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంపై నమ్మకాన్ని రెట్టింపు చేసింది.
వైసీపీ కుట్రలన్నీ తేలిపోతున్నాయి !
రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల జోరు చూస్తుంటే, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం బూమరాంగ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలు ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకోవడం ద్వారా.. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పట్ల ఉన్న నమ్మకాన్ని చాటిచెబుతున్నాయి. లక్షకు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రస్థానం, కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఆగిపోయేది కాదని స్పష్టమవుతోంది. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శకత ప్రజల్లో గొప్ప భరోసాను నింపుతోంది.
వెలవెలబోతున్న జగన్ రాజకీయ కుట్రలు
జగన్ రెడ్డి , వైసీపీ ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా, అవి అభివృద్ధి ముందు వెలవెలబోతున్నాయి. ఐదేళ్ల పాటు అభివృద్ధిని విస్మరించిన తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అందుకే ప్రస్తుత ప్రభుత్వ నిర్మాణ పథకాలను వారు స్వాగతిస్తున్నారని అర్థమవుతోంది. క్షుద్ర రాజకీయాల కంటే కుటుంబం కడుపు నింపే ఉపాధి, అభివృద్ధి ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీ రాజకీయ భవిష్యత్తును మరింత సంకటంలోకి నెట్టేలా ఉన్నాయి.


