జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని తనకు తెలియని యాప్ గురించి పేపర్లో రాసిచ్చింది చదువుతున్న సమయంలో పులివెందులలో వైసీపీకి అనాదిగా ఓటు బ్యాంకుగా ఉన్న కొంత మంది టీడీపీలో చేరిపోయారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక కోసం టీడీపీ నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి బాధ్యతలు తీసుకుని .. గ్రామాల్లో పలుకుబడి ఉన్న వారితో మాట్లాడి…. టీడీపీ వైపు మొగ్గేలా చేస్తున్నారు. కానీ ఈ పరిణామాల్ని నియంత్రించడానికి వైసీపీ తరపున ఎవరూ ముందుకు రావడం లేదు.
సతీష్ రెడ్డికి మాటలెక్కువ – చేతలు తక్కువ
ఇటీవలి కాలంలో పులివెందుల వైసీపీ విషయంలో అవినాష్ రెడ్డి పెద్దగా మాట్లాడటం లేదు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సతీష్ రెడ్డే ఎక్కువగా మాట్లాడుతున్నారు. రాజారెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉండి.. బయటపడిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్ కోసం మాట్లాడుతూండటం వైసీపీ వర్గీయులకే నచ్చడం లేదు. నిజానికి పులివెందులలో ఇంత కాలం జరిగింది రాజకీయం కాదు. వర్గ పోరాటం. అలాంటి వర్గ పోరాటంలో సతీష్ రెడ్డి వచ్చి పార్టీలో చేరిపోతే కలుపుకునేందుకు వైఎస్ కుటుంబ వర్గాలు సిద్ధంగా ఉండవు. అదే సమయంలో జగన్ ను మెప్పించాలంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలన్నా ఫార్ములాను సతీష్ రెడ్డి పాటిస్తున్నారు. ఇది కూడా ఎబ్బెట్టుగా మారింది. ఆయన పులివెందుల వైసీపీకి ప్లస్ కాదని..మైనస్ అని ఆ పార్టీ క్యాడర్ గొణుక్కుంటున్నారు.
ఈతి బాధల్లో అవినాష్ రెడ్డి !
వివేకా హత్య కేసులో ఇరుక్కున్న అవినాష్ రెడ్డి ప్రజల ముందుకు తరచుగా రాలేకపోతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లిన వివేకా మర్డర్ కేసే గుర్తుకు వస్తుంది. పులివెందుల ప్రజలకు వివేకాతో అనుబంధం ఉంది. సౌమ్యుడయిన ఆయనను అంత ఘోరంగా చంపడమేకాదు.. గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేయడం, కట్లు కట్టి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. అలాగే వైఎస్ షర్మిల, విజయమ్మ వేరు బాట పట్టడంతో ఆ కుటుంబానికి నిజమైన అభిమానులు కూడా వైఎస్ జగన్ పై అంత సానుభూతితో లేరు. పార్టీ కోసం చాలా కాలంగా పని చేస్తున్నా.. పై స్థాయి నేతలు సంపాదించుకున్నారు కానీ.. తమకు ఏమీ ప్రయోజనం లేదన్న భావనలో లోకల్ క్యాడర్ ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే అవినాష్ రెడ్డి డబ్బులు పంచాల్సి వచ్చింది.
అధికార బలంతో ప్రయత్నిస్తున్న టీడీపీ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులలో పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అసలు కడపలోనే రాలేదు. కడప జడ్పీలో మొత్తం 52 స్థానాలు ఉంటే అందులో 49 ఏకగ్రీవమయ్యాయి. ఇప్పుడు పులివెందులలోనే పదకొండు మంది పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అందుకే ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ వచ్చింది. గ్రామాల్లో ఉన్న రాజకీయాలను అర్థం చేసుకుని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ జరుగుతున్నదేమిటో గుర్తించకపోతే.. ఆయన పరువు పోతుంది.