మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ చేతికి రాళ్లు అందించారు. ఆడబిడ్డలకు రూ.1500 ఇచ్చే పథకం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ లో అన్ని పథకాల అమలు జరుగుతున్నాయని ఒక్క పథకమే పెండింగ్ లో ఉందని విజయనగరంలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతటితో ఆగిపోతే బాగుడేది.. ఆ ఒక్క పథకం అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మాల్సి ఉంటుందన్నారు. అయినా చంద్రబాబు ఆ పథకం అమలు కోసం కసరత్తు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అచ్చెన్నాయుడు వీడియో ఇలా రాగానే అలా వైసీపీ నేతలు రాళ్లందుకున్నారు. అచ్చెన్నాయుడు…అలా చెప్పాడని..టీడీపీ పథకం అమలు చేయదని.. మహిళల్ని మోసం చేశారని ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వైసీపీ సోషల్ మీడియా పేరుతో కొత్తగా పుట్టుకొచ్చిన హ్యాండిల్స్ ఆ వీడియోను తెగ తిప్పేస్తున్నాయి. నిజానికి అచ్చెన్నాయుడు పథకం అమలు కష్టసాధ్యమన్న కోణంలోనే చెప్పారు కానీ.. అమలు చేయడం లేదని చెప్పలేదు. సాధారణంగా రాజకీయ నేతలు ఏ పథకం అయినా సులువుగా ఇచ్చేస్తున్నామని చెప్పరు. ఎంతో కష్టపడి.. సంపద సృష్టించి ఇస్తున్నామని చెబుతారు. అచ్చెన్నాయుడు కూడా అంతే.
ఆడబిడ్డకు రూ.1500 ఇవ్వాలన్న పథకం ప్రభుత్వానికీ కీలకమే. ఇది అమలు చేస్తే మేజర్ హామీలన్నీ అమల్లోకి వచ్చినట్లవుతుంది. కాస్త ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుని పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ పండగ చేసుకుంటోంది. టీడీపీ పై రాళ్లేయడానికి అచ్చెన్నా మాటలే ఓ ఆయుధంగా మారాయి.