ఎలా మాలోకం ఎక్కడిదాకా వెళ్లావురా అంటే.. ఎక్కడికో లోకపు అంచుల వరకూ వెళ్లాను సార్ అంటాడో పనిమంతుడు. అయితే అక్కడ్నుంచి దూకెయ్రా పీడా విరగడవుడుందని చిరాకుపడతాడు బాస్. ఇలాగే వైసీపీ, సాక్షి మీడియా వ్యవహారం ఉంది. అయితే వైసీపీలోనే అందరి కంటే ముందే బాస్ ఆ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. అన్నీ తెలిసినా కింద ఉన్న వారు ఆయనను ఫాలో అవ్వాల్సిందే. వారు కూడా మాయాలోకంలో విహరిస్తూ ..బయట ఏం జరుగుతుందో తెలిసినా తెలియనట్లుగా డ్రామాలు వేస్తూంటారు. ఏంటన్నా ఇంత అమాయకంగా ఉన్నారని ఎవరైనా ప్రశ్నించకుండా.. ఎదురుదాడి ప్లాన్ అమలు చేస్తారన్నమాట.
చంద్రబాబు విదేశీ పర్యటన గురించి ఐదు రోజుల ముందుగానే మీడియాకు సమాచారం
చంద్రబాబు 30వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్తారని ఐదు రోజుల కిందటే మీడియా ప్రతినిధులకు సమాచారం వచ్చింది. చంద్రబాబు అయోధ్య టూర్ కు వెళ్తున్నారని చెప్పినప్పుడే విదేశీ పర్యటన సమాచారం ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే అదేమీ తెలియనట్లుగా వైసీపీ, సాక్షి జగన్ రెడ్డి తరహాలో.. చంద్రబాబు సీక్రెట్ పర్యటనకు వెళ్లారని.. సీక్రెట్ గా రాసుకోవడం ప్రారంభించారు. మొదట హైదరాబాద్ కు వెళ్లారట.. అక్కడి నుంచి లండన్ కు వెళ్లారట. లండన్ కు వెళ్లాలంటే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచే కదా వెళ్లాలి?. విజయవాడ నుంచి జగన్ రెడ్డిలా ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకోలేరుగా !
వ్యక్తిగత పర్యటనకూ.. అధికారిక పర్యటనకు తేడా తెలియదా ?
చంద్రబాబు గతంలో కుటుంబాన్ని పట్టించుకోకుండా రాజకీయాలు చేశారు. కానీ 2019 నుంచి కాస్త పద్దతి మార్చుకున్నారు. వారాంతాలతో పాటు ప్రత్యేకమైన సందర్భాల్లో కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన వ్యక్తిగత పర్యటన గురించి ప్రతి విషయం చెప్పాల్సిన పని లేదు. అధికారిక పర్యటనల గురించి అయితే స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు దావోస్ తో పాటు సింగపూర్ , అమెరికా వంటి దేశాల్లో పర్యటించారు. ఆయా దేశాల్లో పర్యటించినప్పుడు మినిట్ టు మినిట్ టూర్ షెడ్యూల్ అప్ డేట్ చేశారు. అదంతా రికార్డెడ్. మాయా లోకంలో ఉండే సాక్షికి ఇవి కూడా సీక్రెట్ పర్యటననల్లాగే కనిపిస్తున్నాయి.
సాక్షి ట్రాప్ లో .. ఏబీఎన్ వంటి మీడియా సంస్థలు
నిజానికి ఇలాంటి వార్తలు.. సామాన్య ప్రజలు పట్టించుకోరు. కానీ ఈ వార్తలకు ఇతర మీడియా వివరణ ఇస్తున్నట్లుగా వార్తలు ప్రచారం చేయడమే ఆశ్చర్యకరం. ఏబీఎన్ చానల్ ఈ అంశంపై డిబేట్ పెట్టింది. వైసీపీ చేస్తున్న సీక్రెట్ టూర్ ఆరోపణలు.. పిచ్చి పిచ్చి కథలను .. పట్టించుకోకపోవడమే.. వారి విశ్వసనీయత ఎంత ఘోరంగా ఉందో తేల్చేసేలా చెప్పాల్సింది పోయి.. చర్చలు పెట్టారు. వైసీపీ స్ట్రాటజీ ఒకటే. తాము ఓ లోకంలో ఉంటాం. అదే లోకంలోకి ప్రజలందర్నీ తీసుకెళ్లి తమ పబ్బం గడుపుకోవాలనుకుంటారు. వారికి తమ వద్ద ఉన్న మీడియా, సోషల్ మీడియాలను వాడుకుంటారు. వీటి ట్రాప్ లో అప్పుడప్పుడు ఇతర మీడియా, టీడీపీ సానుభూతిపరులు కూడా పడుతూ ఉంటారు. అదో టైంపాస్.. ప్రజలకు తెలియని నిజాలు ఉండవు. తెలిసినా తెలియనట్లు ఉండేవారికి ఎవరూ తెలిసేలా చేయలేరు.
