ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ యుద్ధం ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. అభ్యంతరకర పోస్టులు, వ్యక్తిత్వ హననం, బూతు పురాణాలతో రెచ్చిపోతున్న సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు మళ్లీ ఉక్కుపాదం మోపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్‌లో చోటుచేసుకున్న మార్పులు, ఆ తర్వాత పోలీసులు ప్రారంభించిన రెండో రౌండ్ కోటింగ్ ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి.
ఇటీవల బూతులందుకుంటున్న వైసీపీ కొత్త బ్యాచ్
వైసీపీ ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న సోషల్ మీడియా బ్యాచ్, ఇటీవల కొత్త పెయిడ్ వర్కర్ల రంగప్రవేశంతో మళ్లీ యాక్టివ్ అయ్యింది. అయితే, ఈ సారి వారు ఎంచుకున్న భాష, చేస్తున్న వ్యక్తిగత దూషణలు గత పరిమితులను దాటిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం నిఘా పెంచి, అటువంటి సైకో ప్రవర్తన కలిగిన వారిని ఏరివేసే పనిలో పడింది. వరుస అరెస్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వైనం చూస్తుంటే.. ఈసారి చర్యలు మరింత కఠినంగా ఉన్నాయని అర్థమవుతోంది.
గుడ్డిగా నమ్మి జైలు పాలవుతున్న కార్యకర్తలు
తాము పెంచి పోషిస్తున్న కార్యకర్తలు అరెస్ట్ అవుతుంటే, పార్టీ నుంచి కనీస స్పందన కరువైంది. గతంలో ఎవరైనా అరెస్ట్ అయితే వియ్ స్టాండ్ విత్… అంటూ పోస్టర్లు వేసేవారు, లీగల్ టీమ్‌ను పంపేవారు. కానీ ఇప్పుడు, అరెస్ట్ అయిన వారు తమ పార్టీ పే రోల్లో ఉన్నారని చెప్పుకోవడానికి కూడా వైసీపీ ఇష్టపడటం లేదు. వారిని లేకి’ మాటలు మాట్లాడే అరాచక శక్తులుగా చూస్తూ పార్టీ దూరం పెట్టడం, క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. గతంలో కూడా ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించిన చాలా మంది సోషల్ మీడియా వారియర్స్ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారిని ఆదుకునే నాథుడు లేడు, కనీసం లాయర్ ఫీజులు కట్టే దిక్కు కూడా లేదు. ఇప్పుడు కొత్తగా రంగంలోకి దిగిన పెయిడ్ బ్యాచ్’ కూడా అదే తప్పు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. జగన్‌ను, పార్టీని గుడ్డిగా నమ్మి ప్రత్యర్థులపై బూతులు కురిపిస్తున్న వీరికి.. చివరకు మిగులుతున్నది పోలీస్ కేసులు, స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలే.
గీత దాటిన ప్రతి ఒక్కరికీ షాక్ ట్రీట్మెంటే !
పార్టీ అధినాయకత్వం తమను కేవలం ఒక అస్త్రం లా వాడుకుని, అవసరం తీరాక వదిలేస్తోందన్న ఆవేదన వైసీపీ క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతోనో లేదా చట్టపరమైన ఇబ్బందుల వల్లో కానీ, ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడకపోవడం ఆ పార్టీ అంతర్గత బలహీనతను సూచిస్తోంది. కేసులు బహుమతిగా రావడం, పార్టీ నుంచి రక్షణ లేకపోవడం వంటి పరిణామాలు మిగిలిన కార్యకర్తలను భయపెడుతున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అరాచకానికి దిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సందేశాన్ని పోలీసులు గట్టిగానే పంపిస్తున్నారు. ఈ క్రమంలో బలి పశువులవుతున్నది మాత్రం పార్టీపై ప్రేమతోనో, పేరోల్ కోసమో పనిచేసే సామాన్య కార్యకర్తలే.
