సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్ లు చేసిన కేసులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణి అరెస్ట్ కాగానే, ఆమెను పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్తారని ప్రచారం జరిగింది. కార్యకర్తలకు కష్టం వస్తే వారికి అండగా ఉంటానని చెప్పిన జగన్.. కృష్ణవేణి అరెస్ట్ విషయంలో ఆమెకు ఆ భరోసాను కల్పించలేకపోయారు. గతంలో పలు కేసుల్లో అరెస్ట్ అయిన కీలక నేతలు నందిగం సురేశ్ , పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీలు అరెస్ట్ అయితే పరామర్శ పేరిట జైలుకు వెళ్లి కలిసి వచ్చిన జగన్.. కృష్ణవేణికి మాత్రం కనీస మద్దతును ఇవ్వలేకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం. కష్టకాలంలో ఆదుకొని, వారిని ప్రోత్సహించిన పార్టీ ఎక్కువ కాలం నిలబడుతుంది. అంతేగాని, కార్యకర్తలను రాజకీయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటే పార్టీల భవిష్యత్ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. కార్యకర్తలకు అధికంగా రాజకీయ అవకాశాలు ఇచ్చింది కనుకే టీడీపీ ఇంకా తన ప్రభావాన్ని అలాగే నిలబెట్టుకోగలిగింది. అదే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కార్యకర్తల వైపు చూడటం, అధికారం రాగానే కార్యకర్తల నుంచి మొహం చాటేయడం కనిపిస్తోంది. అందుకే వైసీపీ ఓటు బ్యాంక్ నానాటికీ పతనం అవుతోంది.
సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో కృష్ణవేణిని అరెస్ట్ చేసి రెండు రోజులు గడుస్తున్నా..జగన్ ప్యాలెస్ ను వదిలి బయటకు రావడం లేదు.పార్టీ నేతలను మాత్రమే పంపి చేతులు దులుపుకున్నారు. అదే పార్టీ నేతలు అరెస్ట్ అయితే ఇలాగే తాపీగా కూర్చునేవారా అని వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు పదవులను ఎంజాయ్ చేసిన నేతలు, అధికారం కోల్పోయాక వెంటనే జారుకున్నారు. కానీ, కార్యకర్తలు జెండాను మోస్తూనే ఉన్నారు. వారిని కడుపులో పెట్టి చూసుకుంటానని డైలాగ్ లు కొట్టిన జగన్.. కృష్ణవేణి అరెస్ట్ అయితే ఎందుకు జైలుకు వెళ్లి పరామర్శించలేదని ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్లే ప్రశ్నిస్తున్నారు. ఇది పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తల తిరుగుబాటుకు దారితీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.