పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కుట్రలకు తెరలేపింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కల్తీ నెయ్యి పాపాలను, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏకంగా 15 నెలల క్రితం జరిగిన ఒక పాత దొంగతనం ఉదంతాన్ని.. ఇప్పుడే తాజాగా జరిగినట్లుగా చిత్రీకరిస్తూ విష ప్రచారం చేస్తోంది.
గతేడాది జనవరిలో ఓ బ్యాంకుకు చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పరకామణిలో బంగారం దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అప్పట్లోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, బంగారం స్వాధీనం చేసుకుని, మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇదంతా రికార్డుల్లో ఉన్న బహిరంగ సత్యం.
పెంచలయ్య అనే సదరు నిందితుడు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం తిరుమలలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. తన అనుచరులు చేసిన పాపాలను అప్పట్లో అణిచివేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు అదే ఘటనను కల్తీ చేస్తున్నారు. అసలు ఆ దొంగతనం ఎప్పుడు జరిగిందో చెప్పకుండా, తేదీలను దాచిపెట్టి.. ఏదో ఇప్పుడే భద్రతా వైఫల్యం జరిగిందన్నట్లుగా కథనాలు అల్లడం వారి నైతిక పతనానికి పరాకాష్టగా మారింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడేందుకు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా ల్తీ నెయ్యి వ్యవహారంలో తమ బండారం బయటపడటంతో, ఆ తప్పు నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆశ్రయిస్తున్నారు. తప్పు మీద తప్పు చేస్తూ, అబద్ధాలతో ఒక వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూడటం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. పాత నేరాలను కొత్త ప్రభుత్వం ఖాతాలో వేయాలని చూడటం వారి తీరు మారలేదనడానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.
