వైఎస్ఎఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయాలకు ఔట్ డేటెడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఓ సారి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి ఏ ఎన్నికలలోనూ పోటీ చేయడం లేదు. చివరికి చదువుకున్న వారు బ్యాలెట్లతో వేసే ఓట్లు అయిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ పోటీ చేయలేదు. ఇప్పుడు పులివెందుల ఎన్నికలను ఎందుకు జరిపారని జగన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం, పోటీ చేసినా..అలాంటి అరాచకాలకు చాన్స్ లేకపోవడంతో జగన్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కానీ ఆయనకు రాజకీయం రాదని అందరికీ అర్థమైపోయింది.
ఎన్నికలు వాయిదా వేయలేదని నీలం సహానిపై జగన్ విమర్శలు
నీలం సహాని .. జగన్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరిగా పని చేశారు. చాలా సార్లు కోర్టు ధిక్కరణ హెచ్చరికలు అందుకున్నారు. జగన్ రెడ్డి కోసం అలా కష్టపడి పని చేసినందుకు ఎస్ఈసీ పదవి ఇచ్చారు. ఆమె ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేదని..గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారని జగన్ ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. అంటే ఆమెపై ఎన్నికలను వాయిదా వేయాలని ఒత్తిడి తెచ్చారు.కానీ వర్కవుట్ అవ్వలేదు. అందుకే రోజూ.. ఎస్ఈసీ ఆఫీసు ముందు పనిగట్టుకుని ధర్నాలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ మనుగడ సాగిస్తుందా ?
సొంత ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకమే లేదా?
ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లేశారని.. రచ్చ చేస్తున్నారు. దొంగ ఓట్లు వేస్తే.. ఆ గ్రామాల వారికి తెలియదా?. క్యూలైన్లలో నిల్చున్నప్పుడు ఆ ఊరి వాళ్లో కాదా తెలియదా ? బయట వాళ్లు వస్తే సులువుగా గుర్తు పట్టరా?. ప్రతి పోలింగ్ బూత్లోనూ వైసీపీ ఏజెంట్లు ఉన్నారు. అయినా జగన్ కు వారు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. అందుకే ఇలా రచ్చ చేస్తున్నారు.రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరిగితే.. బహిష్కరించాలని వైసీపీ పిలుపునిచ్చింది.కానీ అరవై శాతం మంది ఓట్లేశారు. తమకు ఓట్లు వేయని వాళ్లందర్నీ దొంగ ఓటర్లు అని అంటే సరిపోతుందా ?
కౌంటింగ్నూ బహిష్కరిస్తారట !
కౌంటింగ్ నూ బహిష్కరిస్తామని వైసీపీ ప్రకటించింది. అదేదో ముందుగా ఎన్నికల సమయంలోనే బహిష్కరించి ఉంటే పరువు అయినా ఉండేది. ఇప్పుడు ప్రజలు స్వేచ్చగా ఓట్లు వేశారని.. తమకు ఓటమి ఖాయమన్న కారణగా జగన్ రెడ్డి వణికిపోతున్నారు. ఫలితాలు అలాగే వస్తే..ఇక జగన్ రెడ్డికి పులివెందులలోనూ పునాదులు కదిలిపోయినట్లే. వైసీపీ పీడ.. రాష్ట్రానికి వదిలిపోయేందుకు మంచి శకునం కనిపించినట్లే అనుకోవచ్చు.