జాతరల్లో పోతరాజు వేషాలు వేసేవాళ్లు.. తమను తాము కొట్టుకుని డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు లిక్కర్ స్కాం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి కూడా అంతే. వేల కోట్ల స్కాం చేసి … దొరికిన డబ్బులు తమవి కాదని వాదించేందుకు విచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. ఈ క్రమంలో తమను తాము గట్టిగా కొట్టుకుంటోంది. వైసీపీ పరిస్థితి చూసి టీడీపీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు.
రూ. 11 కోట్ల పేరుతో విచిత్రమైన రాజకీయం
హైదరాబాద్ శివారులో తీగల విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి ఫామ్ హౌస్ లో రూ.11 కోట్లు దొరికాయి. దుబాయ్ నుంచి వచ్చిన లిక్కర్ కేసు నిందితుడ్ని పట్టుకుంటే అతను చెప్పిన సమాచారం ఆధారంగా అక్కడ సోదాలు చేసి పట్టుకున్నారు. ఆ పదకొండు కోట్లు టీడీపీ పెట్టిందని వాదన తెరపైకి తెచ్చారు. ఆ విజయేందర్ రెడ్డి టీడీపీ నేత అంటున్నారు. వీరి వాదన చూసి వైసీపీ వర్గాలకూ మైండ్ బ్లాంక్ అవుతోంది. విజయేందర్ రెడ్డి పేరుతో ఓ డిస్టిలరీని రాజ్ కసిరెడ్డి నడిపారు. వారిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. బయోడైవర్సిటీ పార్క్ ఎదురుగా అత్యంత విలాసవంతమైన ఆస్పత్రిని కూడా నడుపుతున్నారు. కలిసి వ్యాపారం చేస్తూంటే.. ఆ డబ్బులు తమని కాదని.. లిక్కర్ స్కాంవి కాదని వాదిస్తున్నారు. ఈ వాదనలు అన్నీ వైసీపీ తనను తాను గట్టిగా కొరడాతో కొట్టుకుంటున్నట్లే ఉన్నాయి.
వెంకటేష్ నాయుడి పేరుతో మరో వింత వాదన
వెంకటేష్ నాయుడ్ని వైసీపీ ఎలా ప్రోత్సహించిందో కళ్ల ముందే ఉంది. చెవిరెడ్డితో కలిసి పారిపోయేందుకు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లిన సమయంలో పోలీసులు పట్టుకొచ్చారు. ఇద్దర్నీ ఒకే సారి అరెస్టు చేశారు. వారిద్దరి సంబంధం బహిరంగం. అయినా కొన్ని ఫోటోలు పట్టుకొచ్చి వెంకటేష్ నాయుడు టీడీపీ నేత అంటారు. మళ్లీ వారి కోసం న్యాయస్థానాల్లో లాయర్లను పెట్టి వాదిస్తున్నారు. ఇదంతా వైసీపీ నేతలు ప్రజలను గందరగోళ పరిచేందుకు చేస్తున్న ప్రయత్నమని కానీ పరువు పోతోందని వైసీపీ క్యాడర్ గగ్గోలు పెడుతోంది.
లిక్కర్ స్కాం జరగలేదని నమ్మే ఒక్క సామాన్యుడినైనా వైసీపీ కనిపెట్టగలదా ?
లిక్కర్ స్కాం జరగలేదని అనుకోని వారు ఎవరూ ఉండరు. వైసీపీ నేతలే లేరు. ఎందుకంటే అది బహిరంగంగా జరిగిన దోపిడీ. దొంగతనాలు చేయడానికి జగన్ రెడ్డి ఎలాంటి ఎక్స్ పర్టో.. స్కాములు చేయడంలో ఎంత దిట్టో ప్రజలకు క్లారిటీ ఉంది. ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం పేరుతో లిక్కర్ మాఫియాను నడిపిన వైనాన్ని తాగుబోతులు అసలు మర్చిపోరు. వారి కుటుంబాలు పగతో రగిలిపోతూంటాయి. మద్యం అలవాటు లేని వాళ్లు కూడా… మద్యం స్కాం జరగలేదని అనుకోరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాక్ష్యాలు దొరుకుతున్నప్పుడు…. వాటితో సంబంధం లేదని పోతరాజు వేషాలు వేసే బదులు.. ఇంకేదైనా మార్గం చూసుకుంటే కాస్త గౌరవంగా ఉంటుందని నిట్టూరుస్తున్నారు వైసీపీ నేతలు. లేకపోతే.. తమ్మినేని సీతారాం కొడుకు తేల్చిసినట్లుగా.. వైసీపీ పని ఈ పాటికి పూర్తి అయిపోయినట్లే.