రాజకీయాల్లో అయినా , బయట అని వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనే దాన్ని కాపాడుకుంటేనే గౌరవం ఉంటుంది. అలా కాకుండా.. తమకు అలాంటివేమీ లేవని వ్యవహరిస్తే.. అందరూ చూడకూడని విధంగా చూస్తారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ రెడ్డి పరిస్థితి అదే. ఆయన చేస్తున్న రాజకీయాలతో ఆయనకు అసలు వ్యక్తిత్వం ఉందా అన్న ప్రశ్నలు సొంత పార్టీ వారి నుంచే వస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్టు
జగదీప్ థన్‌ఖడ్ రాజీనామాతో వచ్చి పడిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సపోర్టు బీజేపీకేనని జాతీయ మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ బ్రేకింగులు చూసి చాలా మంది నార్త్ రాజకీయ పరిశీలకులు.. ఎందుకీ అప్రకటిత సంసారం.. నేరుగా ఎన్డీఏలో చేరిపోవచ్చు కదా అన్న సెటైర్లు జగన్ పై వేశారు. వారి మాటలలో చాలా గూఢర్థం ఉంది. జగన్ రెడ్డికి రాజకీయం చేత కాదని..ధైర్యం లేదని అలాంటప్పుడు ఆయనకు పార్టీ ఎందుకన్నది వారి అభిప్రాయం. ఇది వారికి వచ్చే సందేహం కాదు. అందరికీ వచ్చే సందేహమే. ఎన్డీఏ కూటమికి వైసీపీ సపోర్టు చేస్తే ఆయన ఎవరి మీద పోరాడి రాజకీయం చేస్తారు?. ఎన్డీఏకు పిల్లర్‌గా ఉన్న చంద్రబాబు మీదనా ?
అది బీజేపీపై అభిమానం కాదు …భయం !
జగన్ రెడ్డికి వ్యక్తిత్వం లేనంత మాత్రాన ఇతర పార్టీలు కూడా వ్యక్తిత్వం కోల్పోయి చేసిన తప్పుల నుంచి కాపాడవు. ఎందుకంటే ఆ పార్టీలకు వ్యక్తిత్వం ఉంటుంది. అందుకే ఆ పార్టీలు నిటారుగా నిలబడ్డాయి. ఇలా వ్యక్తిత్వం లేకుండా నిలబడితే ఎప్పుడో మరుగుజ్జుగా మారిపోయి ఉండేవి. అయినా ఆ పార్టీలు జగన్ రెడ్డికి తమ మీద ఉన్నది అభిమానమో.. కేసుల నుంచి బయటపడేస్తారన్న స్వార్థమో అర్థం చేసుకోకుండా ఉండవు. అవసరం లేని మద్దతు ఇచ్చారని.. అడగకపోయినా ఎగేసుకుని వచ్చి మద్దతు ఇచ్చారని వ్యక్తిగతంగా అభినందిస్తారేమో కానీ.. పాపం అని కేసుల నుంచి కాపాడరు. ఒక వేళ తాము అధికారంలో లేకపోతే జగన్ రెడ్డి ఎలా వ్యవహరించేవారో ఊహించలేనంత అమాయకులు కాదు. జగన్ రెడ్డి భయభక్తులు చూపిస్తోంది కేవలం అధికారం మీదనే.
ప్రజలకేం చెబుతారు ?
ఏపీలో ఓట్ల చోరీ జరిగిందని కానీ రాహుల్ మాట్లాడటం లేదని జగన్ అన్నారు. రాహుల్ పోరాడుతోంది ఎవరిపైన…? మోదీ, ఎన్నికల సంఘం పైన. మరి తాను మట్టికొట్టుకుపోవడానికి ఓట్ల చోరీ కారణం అనుకుంటున్నప్పుడు … జగన్ రెడ్డి మోదీ, ఎన్నికల సంఘంపై ఎందుకు మాట్లాడరు?. రాహుల్ మాట్లాడాలని ఎందుకు కోరుకుంటున్నారు?. ఇప్పుడు బీజేపీకే మద్దతు ప్రకటించారు. దీనికి ప్రజలకేం చెబుతారు ?. ఇలాంటి వ్యక్తిత్వం లేని రాజకీయ నాయకుడ్ని ఏపీ భరిస్తోంది. తన లాంటి వారు తనకు మద్దతుగా ఉంటారని.. సపోర్టు చేసే వారినీ తక్కువ అంచనా వేస్తూ … రాజకీయాలు చేసేస్తున్నారు.