వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్నాళ్లుగా అంతర్లీనంగా సాగుతున్న వర్గపోరు ఇప్పుడు మావిగన్ పుణ్యమా అని బ్లాస్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందన్న గుసగుసలు తాడేపల్లి ప్యాలెస్‌లో వినిపిస్తున్నాయి. అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని కాన్సెప్ట్‌ను జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తీసుకురావడం పార్టీలోనే పెను చిచ్చు రేపింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఆధిపత్యం కోసం సాగుతున్న సజ్జల వర్సెస్ చెవిరెడ్డి యుద్ధం ఈ వ్యవహారంతో పతాక స్థాయికి చేరినట్లుగా చెబుతున్నారు. ఈ వింతైన పేరు, ప్రతిపాదన వెనుక చెవిరెడ్డి వ్యూహం ఉందనే ప్రచారం జరగడంతో, ఆ నెపాన్ని తన మీదకు రాకుండా చూసుకునేందుకు సజ్జల వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
సలహాదారుల వైఫల్యమా?
మావిగన్ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన ట్రోల్స్, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి వైసీపీలోని ముఖ్య నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ప్రెస్ మీట్లు పెట్టి ఈ వింత పేరును సమర్థించుకుంటే జనం నవ్వుతారనే భయంతో అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా ముఖం చాటేశారు. దీంతో చేసేది లేక రంగంలోకి దిగిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మావిగన్ అనేది ఎవరి సలహా కాదు, అది స్వయంగా జగన్ ఆలోచనే అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా తన పాత సలహా అయిన మూడు రాజధానుల సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడటం, పార్టీలో సలహాదారుల మధ్య ఉన్న విభేదాలను సుస్పష్టం చేస్తోంది.
చెవిరెడ్డి వ్యూహం .. సజ్జల కౌంటర్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మావిగన్ ఐడియాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ కు నూరిపోశారని, అందుకే ఆయనకు ప్రాధాన్యత పెరిగిందని సజ్జల వర్గం గుర్రుగా ఉంది. ఈ క్రమంలోనే పార్టీకి జరుగుతున్న డ్యామేజీని చెవిరెడ్డి ఖాతాలో వేసేందుకు సజ్జల అనుకూల మీడియా వర్గాలు ప్రయత్నించాయి. దీనికి ప్రతిగా సజ్జల ప్రాధాన్యత తగ్గించడం కోసమే కొత్త ప్రయోగాలు చేస్తున్నారనే వాదన చెవిరెడ్డి వర్గం నుంచి వినిపిస్తోంది. ఈ అంతర్గత కోల్డ్ వార్ వల్ల పార్టీ క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. నిన్నటి వరకు మూడు రాజధానులు అన్న నాయకుడు, ఇప్పుడు మళ్ళీ ఈ మావిగన్ ఏంటని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.
సజ్జలకు టైం దగ్గర పడుతోందా?
ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే వైసీపీలో ఒక బలమైన వర్గం అది కూడా సజ్జలను పార్టీ నుంచి బయటకు పంపడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే మూడు నెలల్లో పార్టీలో సంచలనాత్మక మార్పులు ఉంటాయని, కొందరు కీలక నేతలను జగన్ దూరం పెడతారని చెప్పుకుంటున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఇచ్చే అసంబద్ధమైన సలహాల వల్ల పార్టీ పరువు బజారున పడుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కష్టమని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. శంకరగిరి మాన్యాలు పట్టినట్లుగా ఉన్న పార్టీ పరిస్థితిని చూసి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం మావిగన్ మాన్యాలు పట్టి పోకుండా ఇతర పార్టీల వైపు చూడటం ఖాయంగా కనిపిస్తోంది.
అయోమయంలో క్యాడర్
వైసీపీలో నెలకొన్న ఈ అంతర్యుద్ధం కేవలం సలహాదారుల మధ్యే కాకుండా, ఐడియాలజీ పరంగా కూడా దారి తప్పింది. ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియక క్షేత్రస్థాయి నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సాక్షి పేపర్, సజ్జల ఈ కాన్సెప్ట్‌ను సమర్థించుకోవాలని చూస్తుంటే, మరోవైపు గ్రౌండ్ లెవల్లో దీనిపై వస్తున్న జోకులు పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఈ క్రెడిబిలిటీ సంక్షోభం వైసీపీని రాజకీయంగా మరింత బలహీనపరిచేలా ఉంది.
