కమలసేన .. వైసీపీకే లాభం..!

భారతీయ జనతా పార్టీ, జనసేన.. చేతులు కలిపి.. ప్రత్యామ్నాయం తామేనని ప్రకటనలు చేశాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉంది. కానీ వైసీపీ మాత్రం.. తీవ్రమైన విమర్శలు చేస్తోంది. బీజేపీని ఏమీ అనలేని పరిస్థితి కాబట్టి… పొత్తులు పెట్టుకున్న ఆ పార్టీని … వైసీపీ నేతలు పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అయితే.. చాన్స్ వదులుకోకుండా… పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో.. వైసీపీ నేతల నోటి నుంచి వస్తున్న ప్రధానమైన విమర్శ..చంద్రబాబు చెప్పినట్లుగా పవన్ కల్యాణ్ చేస్తున్నారనేదే.

వైసీపీ దూకుడు వెనుక భవిష్యత్ వ్యూహం..!

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. విజయం సాధించాయి. 2019 ఎన్నికలకు వచ్చే సరికి.. అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా.. ఓట్లు చీలిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ..తోడు కావడంతో.. వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ మూడు పార్టీలు కలిస్తే.. ఓటు బ్యాంక్ సమీకృతమవుతుందని… ఆ ఎన్నికలతో తేలింది. ఇప్పుడు.. బీజేపీ – జనసేన కలిసిపోయాయి. టీడీపీ కూడా కలిస్తే.. వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని అంచనా వేసిన వైసీపీ.. భవిష్యత్‌లో టీడీపీ కలవకుండా ఉండాలనే వ్యూహంతోనే.. ముందుగానే.. టీడీపీ ఎజెండా ప్రకారమే అంతా జరుగుతోందన్న ఆరోపణలు ప్రారంభించినట్లుగా అనుమానిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని ఆనందం..!

ఇప్పటికి ఉన్న రాజకీయ సమీకరణాల ప్రకారం చూస్తే.. బీజేపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే.. అధికార పార్టీ నెత్తిన పాలు పోసినట్లే అవుతుంది. జనసేన పార్టీకి ఆరు శాతం.. బీజేపీకి ఒక్క శాతం ఓట్లు ఉన్నాయి. అయితే.. బీజేపీకి మరికొంత ఎక్కువే ఓటింగ్ శాతం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. గత ఎన్నికల్లో బీజేపీ నేతలు.. చంద్రబాబును ఓడించాలని ప్రచారం చేశారు కానీ.. తమకు ఓట్లేయాలని అడగలేదు. అందుకే. .. బీజేపీ క్యాడర్ కూడా.. వైసీపీకే ఓట్లేశారని చెబుతారు. అంటే.. ఓ మూడు, నాలుగు శాతం ఓట్లు అయినా బీజేపీకి ఉంటాయంటారు. అంటే.. ఎలా చూసినా.. ఓ పది శాతానికి అటూఇటూగా ఓట్లు.. బీజేపీ – జనసేనకు ఉండొచ్చు. అదే సమయంలో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా… అటు టీడీపీ, ఇటు బీజేపీ, జనసేనల మధ్య చీలిపోతుంది. దీంతో.. పాలక పార్టీ.. పని సులువు అవుతంది. అందుకే.. బీజేపీ – జనసేన పొత్తు వైసీపీకి అంతర్గతంగా ఆనందం కలిగించింది.

జనసేన క్యాడర్ బీజేపీ లీడర్లతో కలుస్తారా..?

నిజానికి జనసేన క్యాడర్‌కు బీజేపీతో కలిసి వెళ్లాలని లేదు. ఎందుకంటే.. ఆ పార్టీకి ఏపీలో ఉన్న క్యాడర్ అంతంతమాత్రమే. టీడీపీతోనే పొత్తులకు వెళదామని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలు పవన్‌కు నేరుగా చెప్పారు కూడా. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే స్థానిక ఎన్నికల్లో కనీస సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉండదని వారు చెప్పారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడం.. వైసీపీని ఎదుర్కోవాలంటే.. ఆ అధికారం తప్పని సరి అని పవన్ భావించడంతో పొత్తులకు సిద్ధపడ్డారనే విషయం..రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అయిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com