పాలనలో ఉండేవారి ప్రాధాన్యతలను బట్టి ప్రజలు, విమర్శకుల కోణం ఉంటుంది. ఓ పనికిమాలిన వ్యక్తి బాధ్యతల్లో అతడు చేసే పనికిమాలిన పనుల గురించే ఎక్కువగా చర్చిస్తారు. అదే పనిమంతుడు బాధ్యతల్లో ఉంటే అతను ఎంత బాగా పని చేస్తాడు.. ఏమైనా తప్పులు జరిగి ఇంకా బాగా పని చేసి ఉండాల్సిందని విమర్శిస్తారు. అంతే అంటే తేడా స్పష్టంగానే అర్థమైపోతుంది. పనిమంతుడు మరింత బాగా పని చేయాలని ఆశిస్తారు . కానీ పనికిమాలినోడు.. ఘోరమైన పనులు చేయకపోతే చాలని అనుకుంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
వైసీపీ ఐదేళ్లూ అరాచకాలే హాట్ టాపిక్
ఏపీలో జగన్ రెడ్డి సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా ఫలానా పెట్టుబడి ఏపీకి వస్తోందని ప్రచారం జరిగిందా..?. ఫలానా ప్రాజెక్టు పూర్తవుతుందని అనుకున్నారా?. పోనీ గొప్ప పనితీరుతో ప్రజల్ని సమస్యల నుంచి గట్టెక్కించారని ఒక్క ఉదంతంలో అయినా చెప్పుకున్నారా?. అవకాశమే లేదు. సొంత జిల్లాలో డ్యాం కొట్టుకుపోతే తడిగుడ్డేసుకుని పడుకున్నారు. సీఎం వెళ్తే ప్రజలకు సమస్యలు అని చెప్పి లైట్ తీసుకున్నారు. అలాంటి పరిపాలకుడి నుంచి అంతకు మించి ఏమీ ఎక్స్ పెక్ట్ చేయలేరు.ఐదు సంవత్సరాల పాటు ఎంత డిజాస్టర్స్ జరిగినా.. ఎన్ని ఘోరమైనా నిర్ణయాలు తీసుకున్నా.. అంతా మామూలే కదా అనుకున్నట్లుగా పాలన సాగింది. అది నాటి పరిస్థితి.
నేడు చిన్న పొరపాటు జరిగినా చర్చ
ఇప్పుడు ప్రభుత్వంలో పెట్టుబడులపైనే ప్రతి రోజూ చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులు పరుగులు పెడుతున్న వైనమే వైరల్ అవుతోంది. రాజధాని లో జరుగుతున్న పనులు చూసి.. చూపిస్తున్న యూట్యూబ్ చానళ్లను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతా పాజిటివ్ గా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఏదైనా చిన్న సమస్య వస్తే అదే పెద్ద ఇష్యూగా ప్రచారం చేస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేయడం. ఆయన మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే ప్రైవేటు సంస్థలో ఏర్పడిన సంక్షోభం .. ప్రయాణికుల్ని ఇబ్బంది పెడితే ఆయనను టార్గెట్ చేసుకుంటున్నారు. పనితీరుపై అంతకు మించి అంచనాలు పెట్టుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే.. టీడీపీ అంటే.. ప్రజలకు మంచి సేవలు అందించే నమ్మకం నిలబెట్టుకున్న పార్టీ. ఇలాంటి వాటి విషయంలో అంచనాలకు తగ్గట్లుగా పని చేయాల్సిన బాధ్యత టీడీపీ నేతలపైనే ఉంది.
పనితీరు గురించి వైసీపీ నేతలు మాట్లాడటమే విచిత్రం
అయితే టీడీపీ పాలకులు, నేతలు, మంత్రులు సరిగ్గా పని చేయడం లేదని.. వైసీపీ నేతలు మాట్లాడటమే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. వారు ఎప్పుడూ పని చేసిన పాపాన పోలేదు. ఐదు సంవత్సరాల వారి పాలనను ప్రజలు మర్చిపోయే అవకాశం ఉండదు. కరోనా వచ్చినప్పుడు చనిపోయిన వారు చనిపోగా మిగిలిన వారిని తామే రక్షించామని కథలు చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు.. వారి తీరు ఉంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి రక్తం పీల్చడానికి మాత్రమే వైసీపీ నేతలు ఉపయోగించుకున్నారు. వారు ఎప్పుడూ ప్రజల కోసం పని చేయలేదు. అలాంటి వారు ఇప్పుడు.. టీడీపీ నేతల పనితీరులో లోపాలు ఎంచి.. విమర్శలు చేయడం విచిత్రమే అనుకోవాలి.
