పంచాయతీ ఎన్నికల్లో నిఘాకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్… సిబ్బంది చేత వినియోగింప చేస్తున్న యాప్ పై వైసీపీ ఎక్కువ ఆందోళన చెందుతోంది. ఆ యాప్ ద్వారా ఎన్నికల ఫలితాలు మారిపోతాయన్నంతగా కంగారు పడుతోంది. మొదటగా సొంత మీడియాలో ప్రచారం చేయించి.. తర్వాత అనుకూలంగామాట్లాడే ఇతర పార్టీల నేతల ద్వారా ప్రకటనలు చేయించినా అనుకున్నంత ఎఫెక్ట్ రాకపోవడంతో ఇప్పుడు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆ యాప్ టీడీపీ ఆఫీసులో తయారయిందన్న ఆరోపణలను వైసీపీ నేతలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే… గతంలో ఎస్‌ఈసీ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ కూడా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని వైసీపీ నేతలు హడావుడి చేశారు.
నిమ్మగడ్డను ఓ ఆర్డినెన్స్‌తో తొలగించిన తర్వాత సీఐడీతో దర్యాప్తు చేయించారు. తానే ఆ లేఖ రాశానని నిమ్మగడ్డ చెప్పినా… సంబంధం లేని విజయసాయిరెడ్డి లేఖ రాశారని సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ఎస్‌ఈసీ ఆఫీసులో సిబ్బందిని ప్రశ్నించింది. కంప్యూటర్లు తీసుకెళ్లారు. చివరికి ఏమీ తేల్చలేకపోయారు. కానీ సాక్ష్యాలు తారుమారు చేశారనే వాదన మాత్రం వినిపించారు. ఇప్పుడు యాప్ విషయంలోనూ వారు అదే హడావుడి చేస్తున్నారు. ముందుగా టీడీపీ ఆఫీసులో తయారు చేశారని.. ఆ యాప్ కంట్రోల్ రూమ్ టీడీపీ ఆఫీసులో ఉంటుందని… అందులో వీడియోలు టీడీపీ నేతలే పంపించగలరని ఇలా అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ యాప్ ఏ విధంగానూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం లేదు.
మరి వైసీపీ ఎందుకు ఇంత కంగారు పడుతోందనే చర్చ నడుస్తోంది. యాప్ ద్వారా రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రలోభాల వీడియోలను పంపవచ్చు. వీటిని పంపితే అవి సాక్ష్యాలుగా ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. ప్రలోభాలకు .. అక్రమాలకు పాల్పడితే జైలు శిక్షతో పాటు పదవి రద్దవుతుంది. ఇప్పుడు వైసీపీ నేతలపై ఎలాగూ చర్యలు తీసుకునే చాన్స్ లేదు. తన పరిధిలో ఉన్నంత వరకూ ఎస్ఈసీ చర్యలు తీసుకుంటారు. ఆయన చర్యలకు ఆదేశించినా ప్రభుత్వ యంత్రాంగం వైసీపీ మద్దతుదారులపై చర్యలు తీసుకునే చాన్స్ ఉండదు. కానీ.. పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు జమిలీ జరిగితే మరో రెండేళ్లలోనే వస్తాయి. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఈ యాప్ లో వచ్చిన ప్రలోభాల సాక్ష్యాలతో వైసీపీ మద్దతుదారులపై వేటు వేస్తారని.. ఆ ఇబ్బంది లేకుండా అసలు యాప్ ను వినియోగించకుండా చూడాలన్న ఆలోచనకు వైసీపీ వ్యూహకర్తలు వచ్చినట్లుగా చెబుతున్నారు.