ఒక్క డీఏ ఇస్తే.. ఒక్క డీఏ ఇస్తారా అని సాక్షి పత్రిక, వైసీపీ నేతలు తెగ ఫీలైపోతున్నారు. నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉందని ఎందుకు ఇవ్వడంలేదని అంటున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా సీఎం చంద్రబాబు సమావేశమై… వారి సమస్యలను తెలుసుకుని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించి.. వీలైనంతగా మేలు చేస్తామని చెప్పి కొన్ని డిమాడ్లు తీర్చారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కానీ అసలు బాధపడిపోతోంది మాత్రం వైసీపీ. ఆ పార్టీ మీడియా.
తమ పార్టీ సానుభూతిపరులైన వారితో మాట్లాడించి.. అదే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ తాము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న డీఏలు ఎందుకు ఇవ్వలేదో మాత్రం వారితో చెప్పించలేకపోయారు. పెండింగ్ ఉన్న డీఏలన్నీ జగన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలం నాటివే. చంద్రబాబు చెల్లిస్తున్న బకాయిలు కూడా నాటివే. అయినా .. ఉద్యోగులకు ఏమీ ఇవ్వడం లేదని చెప్పేందుకు తంటాలు పడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల్ని రాచి రంపాన్ని పెట్టారు. జీతం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కల్పించారు. డీఎలు ఇవ్వకుండా.. ఇచ్చినట్లుగా చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన ఐఆర్‌ను తగ్గించారు. ఎన్నో విన్యాసాలు చేసి ఉద్యోగులకు రావాల్సిన వాటిని ఇవ్వలేదు. ఇవ్వాల్సిన వాటిని పెండింగ్ పెట్టిపోయారు. అంతేనా ఉద్యోగుల్ని రాజకీయ అవసరాలకు వాడుకున్నారు. వైసీపీ కోసం పని చేసిన వాడే ఉద్యోగి అన్నట్లుగా లేని వాడు వ్యతిరేకి అన్నట్లుగా వ్యతిరేకించారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలాకు పెట్టారు. వైసీపీ ప్రచారసభలకు జన సమీకరణకు వాడుకున్నారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఉద్యోగులు నమ్ముతారా?