రాష్ట్రంలో ఏ చిన్న పెట్టుబడి వచ్చినా, ఏ పరిశ్రమ అడుగుపెట్టినా దానికి బీజం వేసింది జగన్ రెడ్డే అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు వేసుకోవడం వైసీపీకి ఒక అలవాటుగా మారింది. తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ లక్షన్నర కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరుగుతోంది. మరి ఊరుకుంటారా? ప్రారంభిస్తారు.
సాధారణంగా కూటమి ప్రభుత్వం హయాంలో ఏ ప్రాజెక్టు పట్టాలెక్కినా, మేము గతంలోనే ఎంఓయూ చేసుకున్నాం కాబట్టే ఇప్పుడు వస్తోంది అని వాదించడం వైసీపీ నేతలకు పరిపాటి. లక్షన్నర కోట్ల స్టీల్ ప్లాంట్ అంటే చిన్న విషయం కాదు. సాక్షాత్తూ సాక్షి పేపర్లోనే ఈ ప్లాంట్ ప్రకటనలు దర్శనమిస్తున్నా, ఇంకా మా వల్లే ఇది సాధ్యమైంది అనే ప్రచారం ఎందుకు మొదలుపెట్టలేదో అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను అడ్డుకోవడానికి కోర్టుల్లో పిటిషన్లు వేయడం, పర్యావరణ అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం వంటి పనుల్లో వైసీపీ శ్రేణులు ముందుంటాయి. అదే సమయంలో. వాటి ఘనత మాత్రం దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి మాత్రం వెనుకాడరు. వచ్చిన పరిశ్రమను తమది అనుకోవడం, రాని పరిశ్రమను బాబు వల్ల రాలేదని చెప్పడం వారికి రొటీన్.
చంద్రబాబు నాయుడు చొరవతో, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల ఈ పెట్టుబడి ఖరారైంది. కానీ రేపో మాపో శంకుస్థాపన ముగిశాక ఇది మా హయాంలోనే ఖరారైంది అని పేజీల కొద్దీ కథనాలు రాయడానికి అవసరమైన లింకును ఎక్కడో పట్టుకుని రెడీ అయిపోయి ఉంటారు. కియా మోటార్స్ నుంచి గూగుల్ ఏఐ హబ్ వరకు అన్నింటికీ జగన్ రెడ్డి విజన్ అని ట్యాగ్లు తగిలించే వీరు, ఈ లక్షన్నర కోట్ల స్టీల్ ప్లాంట్ను ఎలా వదులుకుంటారు? ఖచ్చితంగా శంకుస్థాపన తర్వాత ఈ క్రెడిట్ వార్ మొదలవ్వడం ఖాయం.
