“మళ్లీ గెలిస్తే జగన్ రెడ్డి విశాఖ వెళ్లరని..అమరావతి నుంచే పరిపాలన చేస్తారని” జగన్ తరపున రాజకీయాలు చేసే వైసీపీ అప్రకటిత అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఓ న్యూస్ యాప్ నిర్వహించిన కాంక్లేవ్ లో పాల్గొని ఈ మేరకు తన అభిప్రాయాలు చెప్పాడు. ఈ మాట చెప్పడానికే ఆయన కాంక్లేవ్‌ను నిర్వహించాలని ఆయన ఆర్థిక సాయం కూడా చేశారన్న ప్రచారం ఉంది. ఈ విషయం పక్కన పెడితే అమరావతినే రాజధానిగా ఉంటుంది..గతంలోతాము మారుస్తామని చెప్పలేదని కూడా చెప్పుకొచ్చారు. మూడు రాజధానులను ప్రజలు వద్దన్నారని కూడా అన్నారు.
అయితే లక్షల కోట్లు పెట్టి అమరావతి కట్టాడనికి తాము వ్యతిరేకమని ఆయన చెబుతున్నారు. దాని కన్నా గుంటూరు, విజయవాడ మధ్య ఐదు వందల ఎకరాల్లో కట్టడమే శాశ్వత పరిష్కారమని సజ్జల చెప్పుకొచ్చారు. ఈ టెర్మ్ లో చంద్రబాబు అమరావతి కట్టకపోతే తాము వచ్చాక .. వికేంద్రీకరణ చేస్తామని చెప్పుకొచ్చారు. అమరావతి ఉండాలా లేదా అన్నది చంద్రబాబు చేతుల్లోనే ఉందని కూడా వ్యాఖ్యానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ తరుపనే మాట్లాడారు. ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు కావు. గతంలో జగన్ రెడ్డి తాను అమరావతిలోనే ఉంటానని చెప్పి ప్రజల్ని మోగించారు. మరోసారి అదే మాట చెబుతున్నారు.
ఏదైనా కావొచ్చు కానీ అమరావతి విషయంలో వైసీపీ చేసిన నిర్వాకాల గురించి ప్రజలకు స్పష్టత ఉంది. చెప్పేది ఒకటి .. చేసేది మాత్రం అమరావతిపై కుట్రలు. ప్రజలు భరించగలిగే స్థితిని దాటిపోయారు. ప్రజల వద్ద నిజాయితీ లేకుండా మాట్లాడే మాటలను ఒకసారి నమ్ముతారు. ప్రతీ సారి నమ్మరు. సొంత రాష్ట్ర రాజధానిగా అసెంబ్లీలో ఆమోదించిన ప్రాంతంపై ఇప్పటికీ కుట్రలు చేస్తూ మళ్లీ అదే పాట పాడితే.. వారి అభిప్రాయానికి విలువ ఏమి ఉంటుంది. మళ్లీ వస్తే అనే మాటను వైసీపీ నేతలు.. ఎక్కువగా ఊహించుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.
వైఎస్ఆర్సీపీ మళ్లీ వస్తే అనే భావన ప్రజల్లోకి వస్తేనే వారి ఒళ్లు జలదరిస్తోంది. అప్పటి నిర్వాకాలను ప్రజలు అంత తేలికగా మర్చిపోయే అవకాశాలు లేవు. మర్చిపోకుండా వైసీపీ నేతలు చేస్తున్నారు. అందుకే.. అమరావతిపై వైసీపీ అభిప్రాయానికి ఎలాంటి విలువా లేదు.


