భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో మత మార్పిళ్లు ప్రారంభించారు. అయితే గతంలోలా కాకుండా ఇప్పుడు హిందువుల్లోకి మత మార్పిడి చేశారు. గతంలో హిందువులైన వారు గల్ఫ్ కు వెళ్లి అక్కడ ముస్లింలుగా మత మార్పిడి చేసుకున్నారు. మళ్లీ తిరుపతి వచ్చారు. వారిని గుర్తించి భూమన హిందూమతంలోకి రావాలని మోటివేట్ చేసి.. మళ్లీ మత మార్పిడిచేశారు.
గతంలో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి, అక్కడ ముస్లిం మతాన్ని స్వీకరించిన యాలమూరి శ్రీనివాస్‌రెడ్డి , పుష్ప దంపతులను తిరిగి హిందూ ధర్మంలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని తన నివాసంలోనే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ముస్లింలుగా మారిన వారు భూమన మాటలతో ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించేందుకు ముందుకు వచ్చారని భూమన వర్గీయులు చెబుతున్నారు. క్రమంలోనే అబ్దుల్లా, అమ్మిన్నా అనే పేర్లను తిరిగి శ్రీనివాస్‌రెడ్డి, పుష్పగా మార్చుకుని మాతృధర్మంలోకి ప్రవేశించారు.
అయితే భూమన వ్యవహారం అంతా.. తనపై ఉన్న నాస్తిక ముద్రను చెరిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. ఆయన కుటుంబసభ్యులు క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. ఆయనకు దేవుడంటే నమ్మకం లేదు. కానీ టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని మాత్రం వదిలి పెట్టరు. ఆయన మతం మారిపోయిన క్రైస్తవుల్ని సామూహికంగా ఘర్ వాసపీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎవరైనా నమ్ముతారేమో కానీ… ముస్లింలను అదీ కూడా గతంలో హిందువులైన వాళ్లను మళ్లీ తీసుకొచ్చి హిందువుల్లో కలుపుతున్నా అంటే ఎవరు నమ్ముతారు?


