ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వదేశీ పిలుపు నినాదం ఈ సారి టెక్ కంపెనీలకూ అందింది. కేంద్ర మంత్రులు స్వయంగా తాము దేశీ టెక్ కంపెనీ అయిన జోహో ఉత్పత్తుల్ని వాడతామని ప్రకటించారు. దీంతో జోహో సీఈవో శ్రీధర్ వెంబు మరింత దూకుడుగా ఈ ఉద్యమాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అయన అరాత్తై పేరుతో ఓ మెసెజింగ్ యాప్ రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
వాట్సాప్ కు ధీటుగా ఉండటమే కాదు..నేరుగా యూపీఐ సేవల్ని అందించేలా అరాత్తై మెసెజింగ్ యాప్ ను తీర్చిదిద్దుతామని శ్రీధర్ వెంబు చెబుతున్నారు. ఆయన ఇలా వాట్సాప్ కు దేశీ ప్రత్యామ్నాయం అరైత్తై అని చెప్పగానే … చాలా మంది విపరీతంగా ప్రచారం చేశారు. ఫలితంగా డౌన్ లోడ్స్ కూడా పెరిగాయి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం అంటే దేశభక్తిని ప్రదర్శించడమే అన్నట్లుగా కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూండటంతో డౌన్లోడ్స్ సహజంగానే పెరుగుతాయి.
కానీ వాట్సాప్ ను అధిగమించడం అన్నది చిన్న విషయం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరిపోయింది. ఇప్పుడు ఇండియన్స్ మాత్రమే అరత్తై యాప్ కు మారాలంటే… ఆ యాప్ను మరిపించాలి. వాట్సాప్ అవసరం లేదని అనిపించేలా చేయగలగాలి. ముందుగా వాట్సాప్ ఉందిగా..ఇంకెందుకు అనుకునేవారి మనసు కూడా మార్చేలా ఈ యాప్ ఉండాల్సి ఉంది. లేకపోతే ట్విట్టర్ కు దేశీ ప్రత్యామ్నాయం అని చెప్పి వచ్చిన కూ ఎలా నిలదొక్కుకోలేకపోయిందో అలాగే అవుతుంది.
అయితే జోహో ఇప్పటికే సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల్లో మల్టీ నేషనల్ కంపెనీగా ఎదుగుతోంది. ఆ సంస్థ ప్రయత్నాలను తక్కువ చేయలేం. కానీ .. లక్ష్యం మాత్రం చిన్నది కాదని అనుకోవచ్చు. కేవలం స్వదేశీ అనే సెంటిమెట్ తో మాత్రం.. వాట్సాప్ ను అధిగమించడం దాదాపుగా అసాధ్యం. అంతకు మించి ప్రత్యేకత చూపించాల్సి ఉంది.