దానం నాగేందర్… నామ్కే వాస్తే కాంగ్రెస్లో ఉన్న నాయకుడు అనే విమర్శ ఉంది! ఆయన కాంగ్రెస్లో ఉన్నారా అనే విషయం ఆయనకే తెలీదు! ఉంటారన్న నమ్మకం అధిష్ఠానినికీ లేదు. ఉన్నారో లేరో అనే సందిగ్ధం కార్యకర్తలకు ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెరాసలో చేరేందుకు చాలా ప్రయత్నం చేశారు. అంతా సిద్ధం చేసుకున్నారు, బ్యానర్లు కట్టేశారు, కటౌట్లు ఎత్తేశారు. మిగిలింది, కండువా మార్చుకోవడమే తరువాయి అనుకున్న తరుణంలో దానం మనసు మార్చుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచీ ఆయన కాంగ్రెస్లో యాక్టివ్గా లేరు. అలాగని, తెరాస కూడా ఆయన్ని చేర్చుకునేట్టుగా లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక మీడియాకి వచ్చిన ఇంటర్వ్యూలో వైకాపా అధినేత జగన్ గురించి మాట్లాడారు. జగన్ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరికాదని ఇప్పుడు చెబుతున్నారు.
150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి, జగన్ను ముఖ్యమంత్రి చేయాలంటూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, ఆరోజునే కొంతమంది కాంగ్రెస్ నాయకులు జగన్ గురించి అధిష్టానానికి లేనిపోనివి నూరి పోశారని దానం చెప్పారు! జగన్ మొండివాడనీ, ఎవ్వరి మాట వినరనీ, ఆయన చిన్నపిల్లాడనీ అయినా ఇప్పుడే ఆయన్ని ముఖ్యమంత్రి చేయడమేంటీ అంటూ ఢిల్లీకి విషయం చిమ్మేశారని చెప్పారు. జగన్ను ముఖ్యమంత్రి చేయడం తప్పుడు నిర్ణయం అయిపోతుందన్న స్థాయిలో అధిష్టాన్ని నమ్మించరాని అన్నారు. కాంగ్రెస్ చెవులు పెద్దవనీ, ఏ చిన్న విషయమైనా ఇట్టే పైదాకా వెళ్లిపోతుందని చెప్పారు. అక్కడి నుంచి జగన్కు వ్యతిరేకంగా నిర్ణయాలు వచ్చాయనీ, దాంతో తన ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. చివరికి ఓదార్పు యాత్ర విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు తప్పుడు భాష్యం చెప్పుకుంటూ వచ్చారని దానం అన్నారు. అంతేకాదు, జగన్ కేసుల గురించి కూడా మట్లాడుతూ… ఆయన్ని నియంత్రించేందుకే లేనిపోని కేసుల్లో ఇరికించారని వ్యాఖ్యానించారు.
ఉన్నట్టుండీ… ఏపీ ప్రతిపక్ష నేత జగన్ను వెనకేసుకొస్తూ దానం నాగేందర్ మాట్లాడటం విచిత్రంగా ఉంది! ఇక్కడ, గమనించాల్సిన మరో విషయం… జగన్ విషయంలో కాంగ్రెస్ తప్పుగా వ్యవహరించిందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం! ఈ వ్యాఖ్యల కాంగ్రెస్ పార్టీకి దానం ఇవ్వదలచుకున్న సూచనగానీ, సందేశంగానీ, సమాచారంగానీ ఏంటో వారికే తెలియాలి. ఆయనే చెప్పారుగా… కాంగ్రెస్ చెవులు పెద్దవని. మరి, మాటలు కూడా ఢిల్లీ వరకూ వెళ్లకుండా ఉంటాయా..?