ఎన్.టి.రామారావు

తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారకరామారావుకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. తెలుగు రాజకీయాలలో, చలనచిత్రరంగంలో ఆయన చెరగరాని ముద్రవేశారు. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఒక వ్యవసాయకుటుంబంలో జన్మించిన రామారావు 1949లో తెలుగు చలనచిత్రరంగంలో ప్రవేశించారు. ఆయన నటించిన తొలిచిత్రం పల్లెటూరిపిల్ల 1950లో విడుదలయింది. షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్ వంటి చిత్రాలద్వారా ఆయన చిరకాలంలోనే తెలుగు ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా కృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోధనుడువంటి పౌరాణికపాత్రలను పోషించటంలో అనన్యసామాన్యమనిపించుకున్నారు.  రామారావు నటించిన లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల, శ్రీకృష్ణ తులాభారం, భూకైలాస్, వెంకటేశ్వర మహాత్యం, భీష్మ, దానవీరశూరకర్ణవంటి పౌరాణిక చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. మరోవైపు సాంఘిక, జానపద, చారిత్రక చిత్రాలలోకూడా రామారావు ప్రజలను రంజింపచేశారు. రాముడు-భీముడు, నిప్పులాంటి మనిషి, అడవిరాముడు, యమగోల, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరివంటి సాంఘిక చిత్రాలు, బందిపోటు, కంచుకోట, రాజకోట రహస్యంవంటి జానపద చిత్రాలు, మహామంత్రి తిమ్మరుసు, బొబ్బిలియుద్ధం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రవంటి చారిత్రక చిత్రాలు నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి.

1982 మార్చి 29న రామారావు హైదరాబాద్ లో తెలుగుదేశంపార్టీని స్థాపించారు. అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి ఉన్న రాష్ట్రప్రజలు ఆ పార్టీకి జేజేలు పలికారు. యువకులు, విద్యాధికులు పెద్దసంఖ్యలో తెలుగుదేశంలో చేరారు. 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. రెండురూపాయలకు కిలోబియ్యంవంటి పలు సంక్షేమ పథకాలను రామారావు ప్రవేశపెట్టారు. అయితే 1984 ఆగస్టు నెలలో రామారావు వైద్యచికిత్సకోసం అమెరికా వెళ్ళగా ఆయన క్యాబినెట్ లోని కీలక మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి తనదగ్గర మెజారిటీ ఉందని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ తిరుగుబాటుకు పరోక్షంగా సాయపడింది. కానీ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత రావటంతో నాదెండ్ల దిగిపోక తప్పలేదు.  

మళ్ళీ పదవినధిష్ఠించిన రామారావు 1985లో మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఆ ఎన్నికలలోకూడా మంచి మెజారిటీ సాధించారు. కానీ తర్వాత మెల్లమెల్లగా రామారావు ప్రభ క్షీణించసాగింది. 1989 ఎన్నికలలో తెలుగుదేశం ఘోర పరాజయం పాలయ్యి కాంగ్రెస్ గద్దెనెక్కింది. 1989-94 మధ్యకాలం రామారావు రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు, పరాభవాలు ఎదుర్కొన్నారు. అయితే 1994లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కానీ మళ్ళీ అధికారాన్ని చేబట్టిన రామారావు నిరంకుశంగా ప్రవర్తించటంతో స్వంత అల్లుడైన చంద్రబాబునాయుడి నాయకత్వంలోనే తిరుగుబాటు జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో బాబు ముఖ్యమంత్రి అయ్యారు. దీనితో తీవ్రంగా భంగపడిన రామారావు ఆరోగ్యం క్షీణించటంతో 1996 జనవరిలో మరణించారు.

రామారావు మొదటి భార్య బసవతారకంద్వారా ఆయనకు 11మంది సంతానం ఉన్నారు. బసవతారకం తర్వాతికాలంలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. రామారావు 1993లో లక్ష్మీపార్వతిని ద్వితీయ వివాహం చేసుకున్నారు.

 

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com