కందిపప్పు ధర రు.120 కి చేరిన కథ!

కెనడా, అమెరికా,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, మయన్మార్‌ దేశాల నుండి ఏటా 35 లక్షల టన్నుల కందులు, పెసలు, ఉలవలు, అలసందలు, మినుములు, బొబ్బర్ల వంటి పప్పుధాన్యాల దిగుమతి చేసుకుంటూ గత్యంతరం లేక వేల కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యం నష్టపోతున్నాము. దీన్ని నివారించడానికి ప్రధాన పౌష్టికాహారమైన పప్పుధాన్యాల ఉత్పత్తిని కూడా కార్పొరేట్ రంగానికే అప్పగించాలన్న ప్రచారం చిన్నగా మొదలైంది.

భారతదేశానికి బలం వ్యవసాయమేనని గుర్తించిన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచవర్షప్రణాళికల ద్వారా, హరిత విప్లవం ద్వారా రైతేకేంద్రం పధకాలు రూపొందించి అమలు చేశారు. ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసిన ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా వ్యవసాయాభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు. దిగుమతులు మానేద్దాం అంటున్నారు. మేకిన్ ఇండియా అంటున్నారు. అయితే పప్పుధాన్యాల ఉత్పత్తి బాధ్యతను కార్పొరేట్ రంగానికి అప్పగించే వాతావరణాన్ని తీసుకురావడానికి వీలుగానే విదేశీ మారక ”ద్రవ్యం ఆదా” ”కార్పొరేటీకరణ” ప్రచారాలు మొదలైనట్టు భావిస్తున్నారు.

విదేశీ కంపెనీలు, వాటితో భాగస్వామ్యం వున్న స్వదేశీ కంపెనీలు కాలుమోపిన పత్తి, వరి, సుబాబుల్‌, జామాయిల్‌, పూలతోటలు, పండ్లతోటల రైతులు ధరలు తగ్గి తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పప్పుధాన్యాలను కూడా వాటికే అప్పగిస్తే రైతులను దోపిడి చేయడం మరింత వి్తరించడమే తప్ప రైతులకు గాని వినియోగదారులైన ప్రజలకు గాని ఏ ప్రయోజనమూ వుండదు.

పప్పుధాన్యాలకు నెలకు మూడువానలు కావలసిందే. వాతావరంణంలో వేడి 2 డిగ్రీలు పెరిగడం వల్ల ‘రెయినీ డేస్’ తగ్గిపోయాయి. రైతులు వేరేపంటలకు మళ్ళిపోతున్నారు. తక్కువ వర్షంతో ఎక్కువదిగుబడి ఇచ్చే పప్పుధాన్యాలపై హైదరాబాద్ లోని అంతర్జాతీయ పరిశోధనా సంస్ధ ‘ఇక్రిశాట్’ పరిశోధనా ఫలితాలు ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు తరలిపోతున్నాయి. ఈ ఫలితాలను రైతుల్లోకి తీసుకు వెళ్ళే విస్తరణా కార్యక్రమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపడంలేదు.

ఈ కారణాలన్నిటివల్లా పప్పుధాన్యాల తలసరి వినియోగం ముప్పై ఏళ్ళలో 60 గ్రాములనుంచి 30 గ్రాములకు పడిపోయింది. ఈ మధ్య పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో పప్పు రూ. 100-120ల వరకు అమ్ముతున్నారు. సామాన్యులు పప్పులు కొనగలిగిన పరిస్థితి లేదు.అదే సందర్భంలో పప్పుధాన్యాల మద్ధతు ధరలు అతితక్కువగా నిర్ణయించిన రైతుల నుండి కొనుగోలు చేస్తున్నారు. 4000-4300 మధ్య మార్కెట్‌ కొనుగోలు సాగుతున్నాయి. ఒక క్వింటాలు ముడి సరుకు నుండి 80కిలోల పప్పు వస్తుంది. అనగా రూ. 100 లెక్క కట్టిన రూ. 6400లు క్వింటాళుకు చెల్లించాలి. కాని, రైతుల నుండి కొనుగోలు చేసిన మధ్యదళారీలు క్వింటాలుకు రూ. 2000లు లాభాన్ని అర్జిస్తున్నారు. రైతులను గిట్టుబాటు కాకపోవడంతో క్రమంగా పప్పుధాన్యాల విస్తీర్ణాన్ని తగ్గించి వేశారు.

కందుల పై విశేషపరిశోధనలు చేసిన రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ నేదునూరి సుబ్బారావు ఇలా అన్నారు ”మొదటి పంట వరి, మొక్కజొన్న, వేరుశనగ వేసిన తర్వాత సాగునీటి అవకాశం ఉన్న చోట రెండో పంటగా పప్పుధాన్యాలను వేయించాలి. తొలకరిలో పప్పుధాన్యాలు వేసి పంట వచ్చిన తర్వాత ఖరీఫ్‌ పంటలు వేసే విధంగా ప్రణాళిక రూపొందించాలి. ఈ విధంగా ఖరీఫ్‌ పంట వేయడానికి ముందు వేసిన తరువాత పప్పుధాన్యాలు పండించవచ్చు. ఈ పంట వల్ల భూమికి నత్రజని చేకూరుతుంది. పప్పుధాన్యాల తరువాత వేసే పంటకు నత్రజని తక్కువగా వినియోగించవచ్చు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ అవసరాలకు సరిపడ పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా పథకాలను రూపొందించి అమలు చేయాలి”

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com