కె.సి.ఆర్.

కేసీఆర్ గా చిరపరిచితుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ నూతన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో, దానికోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారు. మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. తెలుగుసాహిత్యంలో ఎంఏ చేశారు. విద్యార్థిదశలో ఉన్నపుడే రాజకీయానుభవం గడించిన కేసీఆర్, తెలుగుదేశం మొదలైన తొలినాళ్ళలోనే ఆ పార్టీలో చేరారు. 1985లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1987-88, 1997-98లో తెలుగుదేశం ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. 1999-2001కాలంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో తాను ఆశించిన మంత్రిపదవి లభించకపోవటంతో టీడీపీకి రాజీనామా చేశారు. దరిమిలా ప్రత్యేక తెలంగాణ డిమాండ్ తో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపించారు.

2004లో అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 5 పార్లమెంట్ స్థానాలను, 26 అసెంబ్లీస్థానాలను గెలుచుకుంది. కేసీఆర్ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంనుంచి ఎన్నికయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వానికి తెరాస తరపున మద్దతు ఇవ్వటంద్వారా కేసీఆర్, మరో ఎంపీ నరేంద్ర కేంద్ర మంత్రులుగా పదవులు పొందారు. 2004నుంచి 2006వరకు కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో కేంద్రమంత్రిపదవికి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించారు. తర్వాత జరిగిన ఉపఎన్నికలో కరీంనగర్ నుంచి భారీమెజారిటీతో గెలుపొందారు. 2008లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలన్నింటికీ తెరాస ప్రతినిధులు రాజీనామా చేయటంతో జరిగిన ఉపఎన్నికలలో కేసీఆర్ కరీంనగర్ నుంచి 15వేల మెజారిటీతో విజయం సాధించారు. 2009 సాధారణ ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంనుంచి గెలుపొందారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణ విద్యార్థుల జోక్యంతో హింసాత్మకరూపుదాల్చింది. తదనంతర పరిణామాలలో తెలంగాణ సెంటిమెంట్ తారాస్థాయికి చేరుకోవటంతో కేంద్రప్రభుత్వం డిసెంబర్ 9వతేదీన ప్రత్యేకరాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనతో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమం రాజుకోవటంతో కేంద్ర తెలంగాణపై వెనకకు తగ్గింది. కానీ తెరాసతోబాటు తెలంగాణలోని అన్నిపార్టీలూ, తెలంగాణ జేఏసీ, ప్రజాసంఘాలు ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళటంతో యూపీఏ ప్రభుత్వం 2013 జులై 31న తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తర్వాత 2014 మేనెలలో జరిగిన ఎన్నికలలో తెరాస 63 అసెంబ్లీ స్థానాలనూ, 11 పార్లమెంట్ స్థానాలనూ గెలుచుకుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

కేసీఆర్ కుమారుడు తారక రామారావు, కవిత, మేనల్లుడు హరీష్ రావుకూడా తెరాస రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తారకరామారావు, హరీష్ రావు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు నిర్వర్తిస్తుండగా, కవిత నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com