ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటంలో ఇద్దరుచంద్రులూ విఫలమే!

ఇద్దరు చంద్రుల పాలనలో తెలుగు రాష్ట్రాలు ఉజ్వల భవిష్యత్తును సాధిస్తాయని ప్రజలు గంపెడాశతో ఉన్నారు. సంక్షేమ రంగంలో వేల కోట్ల ఖర్చుకు రెండు ప్రభుత్వాలూ వెనుకాడటం లేదు. ఓట్ల కోసం ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ కోసం రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు 20 వేల కోట్లు వెచ్చించడానికి సిద్ధపడ్డాయి. లక్షా 15 వేల 689 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. లక్షా 13 వేల 49 కోట్ల బడ్జెట్ మాదని ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఎన్ని అంకెల గారడీలు చేసినా కర్షకుడి కష్టాలు తీరడం లేదు.

ఇప్పటికే రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఉంది. దాని కోసం ప్రభుత్వాలు వేల కోట్ల భారాన్ని భరిస్తున్నాయి. ఇటు రుణ మాఫీ భరోసా ఉండనే ఉంది. అలాంటప్పుడు రైతు ఆత్మహత్య అనే మాట వినపడ కూడదు. కానీ, రెండు రాష్ట్రాల్లోనూ రైతు ఆత్మహత్యలు ఆగటం లేదు. రోజూ ఎక్కడో ఒక చోట అన్నదాత ఆత్మహత్య అనే విషాదకర వార్తను వింటూనే ఉన్నాం. మరి లోపం ఎక్కడుంది?

ప్రభుత్వాల విధానంలోనే లోపం ఉందని అర్థమవుతోంది. మన దేశంలో వ్యవసాయ రంగం మౌలిక అంశాలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఓట్ల కోసం కక్కుర్తి పడటం వల్ల ప్రజా ధనం వృథా అవుతోంది. రైతులకు ప్రయోజనం కలగకుండా పోతోంది.

సొంత పొలం ఉన్న వారిలో స్వయగా వ్యవసాయం చేసేది దాదాపు 20 శాతం మందే అని పలు రైతు సంఘాల అధ్యయంలో తేలింది. మిగతా 80 శాతం మంది తమ పొలాలను కౌలుకు ఇస్తారు. కానీ పొలం డాక్యుమెంట్ల మీద వ్యవసాయ రుణాలు తీసుకుని వ్యాపారానికో, వేరే అవసరానికో వాడుకుంటారు. వారికి రుణ మాఫీ చేసినా దేశానికి గానీ వ్యవసాయ రంగానికి గానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు అదే జరిగింది.

నిజంగా వ్యవసాయం చేసే వారిలో 80 శాతం మంది కౌలు రైతులు. వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. కాబట్టి ఊళ్లోని సేఠ్ దగ్గర అధిక వడ్డీకి అప్పు చేస్తారు. వీరికి ప్రభుత్వ రుణ మాఫీ వర్తించదు. పైగా వడ్డీ భారం ఎక్కువ. అందుకే, ప్రభుత్వాలు ప్రకటించిన రుణ మాఫీ పథకం వల్ల రైతు ఆత్మహత్యలు ఆగటం లేదు. ఆత్మహత్య చేసుకునే వారిలో 90 శాతం పైగా కౌలు రైతులే.

ఈ వాస్తవాన్ని చంద్రబాబు, కేసీఆర్ గుర్తించడం లేదు. వేలకోట్లు భారం మోస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. బంగారు తెలంగాణ తెస్తానన్న కేసీఆర్ సీఎం అయిన తర్వాత వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికే కాంగ్రెస్ చెప్పింది. వీటిని ఆపాలని డిమాండ్ చేసింది. గతంలో కాంగ్రెస్ హయాంలోనూ రైతులు వేల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు.

మరోవైపు, ఉచిత విద్యుత్తు పథకానికి వేల కోట్ల భారాన్ని ప్రభుత్వాలు భరిస్తున్నాయి. అయినా రైతు సంతోషంగా లేడు. ఎలా ఉంటాడు? వేళకు విత్తనాలు దొరకవు. వాటికోసం లైన్లో నిలబడి ఊపిరాడక రైతులు మరణించిన దారుణ ఘటనఃలు జరిగినా ప్రభుత్వాలకు బుద్ధి రావడం లేదు. ఎరువులు, పురుగు మందులను సకాలంలో, నాణ్యంగా సరఫరా చేయడంపై ప్రభుత్వాలకు పట్టింపు లేదు. చేయాల్సిన పనులను వదిలేసి, ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడం వల్లే అన్నదాత ఆత్మహత్యలు ఆగటం లేదు. రైతు కుటుంబాలకు శోకం తప్పడం లేదు.

దీనికి బదులు, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించడం సరైన పరిష్కార మార్గం. అవసరమైతే ప్రభుత్వాలు కౌంటర్ గ్యారంటీ ఇచ్చినా తప్పులేదు. ఈ 20 వేల కోట్లను కౌంటర్ గ్యారంటీ కింద బ్యాంకుల్లో జమ చేస్తే, లక్షల కోట్ల మేర కౌలు రైతులకు రుణాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు త్వరలోనే ఈ పని చేస్తాయని ఆశిద్దాం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]