‘ద్వేష యోగ’ చేస్తున్న కాంగ్రెస్

గూబ గుయ్యిమినిపించిన వాడి మీద ఒళ్లు మండిపోవడం సహజం. మరి 2014 ఎన్నికలలో దిమ్మతిరిగిపోయేటట్లు షాకిచ్చిన నరేంద్ర మోడిమీద కాంగ్రెస్‌వారికి కోపం ఉండటంలో ఆశ్చర్యమేమీలేదు. అయితే ఏడాది దాటినా కోపం పెరుగుతుందే తప్ప తగ్గుట లేదు. మరి పదేళ్లు హాయిగా ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్ ను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీకి మోడి ఆ అధికారాన్ని దూరం చేశాడు కదా!

అణువణువూ మోడీ మీద, ఆయన పార్టీ కమలం గుర్తు మీదా కాంగీయులకు రోజుకు కొన్ని గ్రాముల చొప్పున కోపం పెరుగుతూనే ఉంది. దాంతో బీపీ వగైరాలు కూడా పెరుగుతూ ఉండొచ్చు. అందుకు యోగా దివ్యమైన ఔషధం. కాంగీయులు మాత్రం మోడీ మీద కోపాన్ని యోగా మీద చూపిస్తున్నారు.

అసలు యోగానే వద్దు పొమ్మంటున్నారు. ఈనెల 21వ తారీఖున 193 దేశాల్లోని దాదాపు 200 కోట్ల మంది ఏక కాలంలో యోగాసనాలు వేయడం ద్వారా ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రక్రియ గొప్పతనాన్ని చాటడానికి సిద్ధమవుతున్నారు. కాంగీయులు మాత్రం ఇదేదో మోడీ కనిపెట్టిన టక్కుటమార విద్య కాబోలని ద్వేషిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు.

యోగా డే బహిష్కరించాలని, ఎలాంటి అధికారిక కార్యక్రమాలు జరపవద్దని ఉత్తరాఖండ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటేమోడీ మీద విషం కక్కడమే ప్రభుత్వానికి ముఖ్యమైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన బాబా రాందేవ్ యోగాశ్రమం ఉన్నది ఉత్తరాఖండ్ లోనే. ప్రభుత్వం బహిష్కరించినా, ఆ ఆశ్రమంలో యోగసాధన జరిగి తీరుతుంది.

యోగా అనేది కేవలం బద్దకిస్టులు చేసేది అని కర్ణాటక మంత్రి ఆంజనేయ కొత్త సూత్రం చెప్పారు. పేరు ఆంజనేయ కాబట్టి కుప్పి గంతుల తరహాలో కామెడీ చేయబోయారు. ఎవడూ కనిపెట్టకపోతే పదాలు ఎలా పుడతాయంటాడు ఘటోత్కచుడు ఎస్వీ రంగారావు… మాయాబజార్ సినిమాలో.

ఆంజనేయ మంత్రి గారు ఏకంగా కొత్త సూత్రమే కనిపెట్టారు. యోగా వల్ల మనిషి ఆరోగ్యవంతుడు అవుతాడు చురుకుదనం పెరుగుతుందనే కనీస అవగాహన కూడా ఆయనకు ఉన్నట్టు లేదు. పాపం చిన్నప్పుడు బడికి పోయాడా లేదో. ఇంతకీ కాంగీయుల ప్రాబ్లం ఏమిటి?

మోడీ మీద ద్వేషంతో బీపీ పెంచుకుంటున్నారు. కడుపు మంటతో ఎసిడిటీ పెంచుకుంటున్నారు. ఆవేశంతో హైపర్ టెన్షన్ తెచ్చుకుంటున్నారు. నిజానికి, మనకంటే వీళ్లకే యోగా ఎక్కువ అవసరం. ధ్యానం మరీ అవసరం. ఈ సత్యం తెలుసుకుంటే వాళ్లకే మంచిది. మనం చెప్పామనుకోండి.. సూట్ బూట్ మనుషులమని మనమీద కూడా రాళ్లేస్తారేమో. మనకెందుకు. గమ్మునుందాం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com