నారాయణా విద్యాసంస్ధల్లో ఏడాదిగా తొమ్మిదిమంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్నీ ఆత్మహత్య అనేకంటే ”వత్తిడి హత్య”అంటే సరిగ్గా సరిపోతుంది. కార్పొరేట్ విద్యా సంస్ధల నుంచి ఈ పదం పుట్టింది 24/7 క్లాస్ రూమ్, స్టడీఅవర్స్, డైలీ, వీక్లీ, టెస్టులకే సమయం చాలని పదహారు పదిహేడేళ్ళ పిల్లల మీద వత్తిడి తప్ప జీవనవైఫల్యాలు, నిస్పృహలు ఏముంటాయి. నాయణ, చైతన్య అంటే కేవలం రెండు సంస్ధల పేర్లు మాత్రమేకాదు. కార్పొరేట్ విద్యరంగానికి బ్రాండ్ పేర్లు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాషా్ట్రల్లో 450 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 125 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 2000 ప్రయివేట్ జూనియర్ కాలేజీలు వున్నాయి. వీటిలో 70 శాతం నారాయణా, చైతన్యా సంస్ధలవే.
జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 8 వేల చదరపు అడుగుల భవనం, రెండెకరాల ఆటస్థలం, అగ్నిమాపక పరికరాలు, పారిశుధ్యం, ల్యాబ్ల వంటి కనీస సౌకర్యాలుండాలి. ఫస్ట్ ఇంటర్ డేస్కాలర్కు బోర్డు నిర్ణయించిన ఫీజు 1,760 రూపాయలు. హాస్టల్, ఎంసెట్, ఐఐటి అమాంబాపతు కలిపి వేలు, లక్షల్లో పిండుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే.
ప్రభుత్వ విద్యాసంస్ధల వైఫల్యాలను సాకుగా చూపి రంగ ప్రవేశం చేసిన ప్రయివేటు విద్యారంగం ఎంసెట్ లో ర్యాంకునే జీవితంగా మార్చేసింది. సర్వస్వమూ అయిన డబ్బుగడించడంలోనే పిల్లలకు భవిష్యత్తు వుందన్న వెర్రి భ్రమలో తల్లిదండ్రులు పిల్లల్ని కార్పొరేట్ జైళ్ళలో వేసేస్తున్నారు. ఇంటర్లో చేరిన మూడు నెలల్లోపే ప్రైమరీ పరీక్షల్లో తక్కువ మార్కులొస్తాయన్న భయంతో విద్యార్థినులు ఉరేసుకున్నారంటే వారిమీద వున్న ఒత్తిడిని అర్ధంచేసుకోవచ్చు. టెన్త్లో 80 మార్కులు తెచ్చుకున్న మెరిట్ విద్యార్థినులే యాజమాన్యం కాఠిన్యానికి తట్టుకోలేకపోతే ఇక సాదాసీదాగా చదివే వారి పరిస్థితి ఊహించవచ్చు.
హాస్టళ్ళుగా మారిన ఆపార్టు మెంట్లలో 25/30 మందికి గాలీ వెలుతురూ చాలని గదులు, దూకడమే తప్ప దిగి నడవడానిక చోటులేకుండా అతుక్కుపోయి వుండే మంచాలు, అంతటి గదికీ ఒకే టాయ్లెట్ కమ్ బాత్ రూమ్, ఐదునిమిషాలు ఆలస్యమైనా క్లాసులో నిలబెట్టే సర్,…ఈ కష్టాలను ఏమాత్రం పట్టించుకోని ‘చదువు పిశాచు’ లైన తల్లిదండ్రులు, దీన్ని ఆసరాగా చేసుకుని కనీససదుపాయాలు కల్పించని ‘ధనపిశాచు’లైన యాజమాన్యాలు కలిసి పిల్లల్ని చంపేస్తున్నాయి.
తప్పించుకోడానిక యాజమాన్యం చర్యలు కూడా దుర్మార్గంగానే వున్నాయి. . ఆత్మహత్యల సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలపడం దగ్గర నుంచి పోస్టుమార్టం వరకు ప్రతి విషయంలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు మిన్నంటే వరకూ ప్రభుత్వంలో ఎలాంటి చలనం వుండదు.
ఇదంతా ప్రభుత్వానిక క్షుణ్ణంగా తెలుసు. కార్పొరేట్ కాలేజీల్లో వరుస ఆత్మహత్యల నేపధ్యంలో విద్యార్ధుల స్ధితిగతులు, వత్తిడికి మూలాల్ని పరిశీలించి నివారణా చర్యలు సూచించాలని 2002 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరదారెడ్డి అనేవిద్యావేత్త అధ్యక్షతన కమిటీని నియమించారు. అనేక కార్పొరేట్ కాలేజీలను హాస్టళ్ళను పరిశీలించిన కమిటీ హాస్టళ్ళలో సదుపాయాలు మనుషులకు సరిపోవని స్పష్టం చేశారు. యవ్వన ప్రాంగణంలో కాలుపెట్టే వయసు పిల్లల అలజడులను దృష్టిలో వుంచకుని కౌన్సిలింగ్ ఏర్పాటు ప్రతీ హాస్టల్ కీ వుండాలని సిఫార్సు చేశారు. కమిటీ నివేదికను కట్టగట్టి అటకఎక్కించేశారు.
విద్యారంగంలో వటవృక్షమైపోయిన కార్పొరేట్ విద్యారంగం ఇంటర్ బోర్డునే శాసించే స్ధాయికి ఎదిగింది. నీతినీ, ధర్మాన్నీ, న్యాయాన్నీ, చివరకు చట్టాన్నీ పక్కనపెట్టైనా ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ విస్ధరించే వ్యవస్ధను మాఫియా అంటారు. కార్పొరేట్ విద్యారంగం ఏవిధంగా చూసినా మాఫియాకి తక్కువకాదు. ప్రభుత్వ కాలేజీల సంఖ్యకు నాలుగింతలు పెరిగిపోయిన కార్పొరేట్ కాలేజీల సామర్ధ్యం ప్రభుత్వమంత ఎత్తుకి పెరిగిపోయింది. ఈ బ్రాండ్ సృష్టికర్త నారాయణ మంత్రిగా ఉన్నారని కాదు. ఆయన ఆపదవిలో లేకపోయినా కూడా కార్పొరేట్ కాలేజీలను తాకాలంటే ప్రభుత్వాలు లోతుగా ఆలోచించుకోవలసిందే!