నారా చంద్రబాబునాయుడు

chandrababu-naidu
chandrababu-naidu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికకాలంపాటు(1995 సెప్టెంబర్ నుంచి 2004 మే వరకు) ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 మే నుంచి  ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 1950 ఏప్రిల్ 20వ తేదీన చిత్తూరుజిల్లాలోని నారావారిపల్లె అనే గ్రామంలో ఒక వ్యవసాయకుటుంబంలో జన్మించారు. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన బాబు విద్యార్థిదశనుంచే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. చదువు పూర్తయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980నుంచి 1983వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, సాంకేతికవిద్యశాఖలమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ మంత్రిగా ఉన్నపుడే నందమూరి తారకరామారావు కుమార్తె భువనేశ్వరిని 1981లో వివాహం చేసుకున్నారు.

రామారావు 1982లో తెలుగుదేశంపార్టీని స్థాపించినప్పటికీ చంద్రబాబు అందులో చేరకపోగా, మామపైనే పోటీచేయటానికికూడా తాను సిద్ధమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే 1983లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంతో దరిమిలా బాబుకూడా తెలుగుదేశంలోకి జంప్ చేశారు. పార్టీ ప్రధానకార్యదర్శిగా వ్యవహరించేవారు. 1989 ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగాతప్ప శాసనసభలో అడుగుపెట్టనని ప్రకటించటంతో చంద్రబాబు తెలుగుదేశం తరపున ప్రతిపక్షనాయకునిగా వ్యవహరించారు. పార్టీపై పట్టుసాధించటానికి చంద్రబాబుకు ఈ అవకాశం బాగా కలిసొచ్చింది.

1994 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం భారీవిజయం సాధించి మళ్ళీ అధికారం చేజిక్కించుకున్నపుడు చంద్రబాబు కీలకమైన ఆర్థిక, రెవెన్యూశాఖలను తీసుకున్నారు.1995లో ఎన్టీఆర్ మీద తీవ్ర అసంతృప్తి చెలరేగి తిరుగుబాటు జరిగినపుడు మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. 2004వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి అత్యధికకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తొమ్మిదేళ్ళ పరిపాలనాకాలంలో జన్మభూమి, శ్రమదానంవంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఐటీరంగంలో విశేషకృషిచేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారు. జాతీయస్థాయి రాజకీయాలలోకూడా కీలకపాత్ర పోషించారు. ఒకదశలో ప్రధాని పదవికి చంద్రబాబు పేరుకూడా ప్రతిపాదనలోకి వచ్చింది. 2003లో తిరుపతి సమీపంలోని అలిపిరివద్ద నక్సలైట్ల హత్యాయత్నంనుంచి తృటిలో తప్పించుకున్నారు. 2004, 2009 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయంపాలవటంతో పార్టీని, శ్రేణులను నిలబెట్టుకోటానికి బాబు ఎంతో కష్టపడాల్సివచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికలద్వారా చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com