హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్న దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తుకోసం ఏర్పాటుచేసిన సిట్ అధికారులు వివిధ మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులను రెండురోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు ముఖ్య ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారుల కాల్ డేటాను తెలంగాణ పోలీసు నిఘా వర్గాలు తమనుంచి తీసుకున్నట్లు సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు ఇవాళ సిట్ అధికారులకు వెల్లడించారు. కాల్ డేటా రికార్డులకోసం తెలంగాణ పోలీసు ప్రతినిధులు లిఖితపూర్వకంగా తమను కోరారని తెలిపారు. మొత్తం ఎనిమిది సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులను విచారిస్తున్నట్లు సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి శ్రీనివాస్ చెప్పారు.