హైదరాబాద్: గుంటూరుజిల్లాలో నిన్న రెవెన్యూసిబ్బందిపై ల్యాండ్ మాఫియా చేసిన దాడి ఉదంతం క్రమక్రమంగా ముదురుతోంది. రెవెన్యూ ఉద్యోగులు ఇవాళ పలుచోట్ల ఆందోళనలకు దిగారు. దాడికి పాల్పడినవారిపై ఎస్సీ-ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలని రెవెన్యూ ఉద్యోగి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేసు పెట్టనిపక్షంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మరోవైపు దాడికి సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
రాజధానికి దగ్గరగా ఉండటంతో మంగళగిరిప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, పోరంబోకు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఆత్మకూరు వద్ద పోరంబోకు భూమిని కొందరు వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని తెలుసుకున్న తాసిల్దారు రెవెన్యూ సిబ్బందిని అక్కడకు పంపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేవారిని అడ్డుకోవటానికి ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బట్టలూడదీసి పరిగెత్తిస్తూ కొట్టడంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. ఇదేమని అడిగిన స్థానికులపైకూడా వ్యాపారులు దౌర్జన్యానికి దిగారు.
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాకు, తాసిల్దారు వనజాక్షికి మధ్య జరిగిన వివాదం విషయంలో అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వోద్యోగులు ఈ ఘటనతో మరింతగా రగిలిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.