హైదరాబాద్: గుర్దాస్పూర్లో తీవ్రవాదులకు, సైనికదళాలకు మధ్య ఉదయంనుంచీ జరుగుతున్న ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతులసంఖ్య 13కు చేరింది. మృతులలో జిల్లా ఎస్పీ బల్జిత్ సింగ్ కూడా ఉన్నారు. ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. దాడికి పాల్పడిన తీవ్రవాదులలో ఒక మహిళకూడా ఉండటం విశేషం. వీరు పాకిస్తాన్ వైపునుంచే పంజాబ్లో ప్రవేశించినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. ఇది ఇంటెలిజెన్స్ సంస్థల వైఫల్యమేనని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే దీనిని రాజకీయం చేయొద్దని, ఎన్కౌంటర్ పూర్తయ్యాక కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపై ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. దేశవ్యాప్తంగా ముఖ్యనగరాలలో భద్రతను కట్టుదిట్టంచేశారు.