సెక్షన్ 8కు ససేమిరా అన్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కేంద్రంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అధికారాలు గవర్నర్‌కు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొంటున్న సెక్షన్ 8ని అమలు చేయటానికి అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఓటుకు నోటు అంశం, తదనంతర పరిణామాలపై గవర్నర్‌తో చర్చించారు. ఈ కేసునుంచి తప్పించుకోవటానికే తెలుగుదేశంపార్టీ సెక్షన్ 8 అంశాన్ని లేవనెత్తుతోందని కేసీఆర్ ఆరోపించినట్లు సమాచారం.

ఓటుకు నోటు అంశాన్ని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా తీసుకుని కేంద్రానికికూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉంటున్న తమ ప్రభుత్వనేతలకు రక్షణ కరువైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడికి, ఇతర కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు ఈ వివాదంపై ఇటీవల గవర్నర్ నరసింహన్ ఢిల్లీవెళ్ళి కేంద్ర పెద్దలను కలిసివచ్చారు. కేంద్రం సూచనమేరకు ఆయన ఇరువురు సీఎమ్‌లతో భేటీ అయ్యి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారని వార్తలొచ్చినప్పటికీ కేసీఆర్ నిన్న ప్రదర్శించిన వైఖరితో పరిస్థితి ఇప్పుడప్పుడే చల్లబడేటట్లు కనబడటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com