జూబ్లిహిల్స్ ఉపఎన్నికల అభ్యర్థుల పరంగా రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేషన్ల గడువు మంగళవారం ముగిసింది. మొత్తంగా 150కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగంగా ఫార్మా సిటీ బాధితులు, రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోయే రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. తమ సమస్యలు చర్చనీయాంశం అవుతాయన్న ఉద్దేశంతోనే తాము నామినేషన్లు వేశామని చెబుతున్నారు.
ప్రధాన పార్టీలకు చెందిన వారు కాకుండా..ఇతరులంతా నిరసనల కోసమే నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఓ పది, ఇరవై మంది ఉపసంహరించుకున్నా మిగతా వారందరూ పోటీలో ఉండే అవకాశం ఉంది. నాలుగైదు ఈవీఎం మిషన్లను ఉపయోగించాల్సి రావొచ్చు. ఎంత మంది పోటీలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు 24వ తేదీ వరకూ ఉంది. నామినేషన్ల పరిశీలన బుధవారం జరుగుతుంది. ఆ రోజున తిరస్కరణకు గురయ్యే నామనేషన్లలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ ఉంటే మాత్రం.. బీఆర్ఎస్అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి ఉంటారు.కానీ అలాంటి అవకాశాలు దాదాపుగా ఉండవని భావిస్తున్నారు. అందుకే ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్యనే పోరు ఉంటుంది.