హైదరాబాద్ యూనివర్సిటీకి రాహు కాలం!

రోహిత్ కి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధులకి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మళ్ళీ నిన్న రాత్రి వచ్చేరు. ఆయన విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు ఎబివిపి విద్యార్ధులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు. కానీ పోలీసుల భద్రత నడుమ రాహుల్ గాంధీ యూనివర్సిటీకి చేరుకోగాలిగారు. నిన్న అర్ధరాత్రి యూనివర్సిటీకి చేరుకొని రోహిత్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, విద్యార్ధులతో కలిసి దీక్షలో కూర్చొన్నారు. రోహిత్ తల్లి, సోదరుడు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.

త్వరలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఆ రాష్ట్రాలలో దళితులను ఆకట్టుకోవడానికే రాహుల్ గాంధి హైదరాబాద్ యూనివర్సిటీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్ధులే కాక ప్రతిపక్ష పార్టీల నేతలు, రాజకీయ విశ్లేషకులు రాహుల్ హైదరాబాద్ పర్యటనలకి అదే కారణమయి ఉండవచ్చునని భావిస్తున్నారు. బహుశః ఆ విమర్శల నుండి తప్పించుకొనే ఆలోచనతోనే ఆయన తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలెవరినీ తనను కలిసేందుకు, తనతో దీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఈయలేదు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ప్రజలలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయాలతో ముడిపడున్నఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని, తమ పార్టీ నేతలని దూరంగా ఉంచినంత మాత్రాన్న దానిని వ్యక్తిగత కార్యక్రమమని చెప్పినా ఎవరూ నమ్మబోరు. ముఖ్యంగా రాహుల్ గాంధి వంటి ప్రముఖ రాజకీయ నాయకుడు విద్యార్ధులతో కలిసి దీక్షలో కూర్చొని రోహిత్ మరణానికి కారకులయిన ఇద్దరు బీజేపీ కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నప్పుడు అది రాజకీయం కాకుండా మరేమవుతుంది?

ఒకవేళ రాహుల్ గాంధి నిజంగానే రోహిత్ పై సానుభూతితో అక్కడికి మళ్ళీ వచ్చేరనుకొంటే, మరి ఇంతకు ముందు చాలా మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు కనీసం ఎందుకు స్పందించలేదు? అనే సందేహం తలెత్తుతుంది. ఒక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలో వివిధ రాష్ట్రాలలో నిత్యం ఎక్కడో అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటిపై రాహుల్ గాంధి ఏనాడు స్పందించిన దాఖలాలు లేవు. కానీ కేవలం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు అంటే దానికి అనేక కారణాలు కనబడుతున్నాయి.

రోహిత్ దళిత విద్యార్ధి కావడం. హైదరాబాద్ లో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగుతుండటం. ఈ వ్యవహారంలో బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నందున, తన రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీని, ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగల అవకాశం ఇందులో ఇమిడి ఉండటం. త్వరలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలున్నదున ఆ ప్రయోజనం సాధించడానికి అంతవరకు ఈ వేడి చల్లారిపోకుండా నిలిపి ఉంచడం కోసం. ఈ ఏడాది ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. అవి రాహుల్ గాంధి రాజకీయ భవిష్యత్ ని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ని కూడా నిర్దేశించబోతున్నాయి. బహుశః అందుకే రాహుల్ గాంధి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు.

రోహిత్ మరణంపై ఈవిధంగా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూనే, ప్రజలని మభ్యపెట్టేందుకే తన పార్టీ నేతలను దూరంగా ఉంచి ఉండవచ్చును. కానీ ఒకవేళ ఈ ప్రయోజనాలన్నీ పొందే అవకాశం లేకపోయుంటే, అసలు రాహుల్ గాంధి హైదరాబాద్ వచ్చేవారా? కనీసం రోహిత్ మరణించిన వార్త ఆయన వరకు వెళ్లేదా? వెళ్ళినా ఆయన పట్టించుకోనేవారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాలేదని ఆయన చెపుతుంటే, ఆయన విద్యార్ధులతో కలిసి దీక్ష చేస్తున్న ఫోటోని ఆ పార్టీ ట్వీటర్ లో ఎందుకు పోస్ట్ చేసింది? అని ఆలోచిస్తే ఆయన కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే వ్చ్చేరని అర్ధమవుతుంది. కానీ ఆయన ఆశించిన ఈ రాజకీయ ప్రయోజనాలు ఒక్కటయినా నెరవేరుతాయా? అంటే అదీ అనుమానమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com