తెలంగాణాలో ప్రతిపక్షాలు ఉండవా?

గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షాలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కోలుకోలేని దెబ్బ తిన్నాయి. అందుకు ఎవరి కారణాలు వారికి ఉండవచ్చును కానీ అవేవీ వాటిని కాపాడలేవని ఖచ్చితంగా చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎదురుదెబ్బలు చాలా తిని ఉంది కనుక అది తట్టుకొని నిలబడగలదు. కానీ వచ్చే ఎన్నికల వరకు పార్టీ ఖాళీ అయిపోకుండా ఉంటేనే అది మళ్ళీ లేచి నిలబడే అవకాశం ఉంటుంది.

ఇక తెదేపాకు ఆ అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితులను చూసిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు “ఒకరు వెళ్ళిపోతే వందమంది నేతలను తయారు చేసుకొంటాను” అని డైలాగ్ చెప్పడమే తప్ప తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోతున్న పార్టీని కాపాడుకొనేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. పార్టీ అధినేతకే పార్టీపై ఆసక్తి కోల్పోయినప్పుడు ఇక ఆ పార్టీ బ్రతికి బట్ట కట్టడం అసాధ్యం. బహుశః అందుకే ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి సీనియర్ నేత పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారని చెప్పవచ్చును. కనుక మిగిలినవారు కూడా ఏదో ఒకరోజు వెళ్ళిపోవడం తధ్యం. అప్పుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రమే మిగిలి ఉంటారేమో?

ఒకవేళ తెలంగాణా నుంచి తెదేపా తప్పుకొంటే ఇక మిగిలింది బీజేపీ. దానితో జత కట్టడానికి ఇప్పటికే కేసీఆర్ పావులు కదుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తెరాసతో మిత్రత్వం, పొత్తులు వద్దనుకొంటే, తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభావానికి గండికొట్టే గొప్ప వ్యూహం ఏదో బీజేపీ అమలుచేయవలసి ఉంటుంది. అప్పుడే తెలంగాణాలో బీజేపీ తన మనుగడ సాధించగలదు. కానీ మొన్న కేసీఆర్ డిల్లీ వెళ్ళినప్పుడు మోడీని ప్రసన్నం చేసుకొన్నట్లు వార్తలు వినిపించాయి. కనుక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెరాసతో దోస్తీకి బీజేపీ సిద్దపడవచ్చును.

అదే జరిగితే దాని ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి.1. తెదేపాతో తెగ తెంపులు చేసుకోవడం. 2.తెదేపాని కూడా తమ కూటమిలో చేర్చుకోవడం.

మంది ఎక్కువయితే మజ్జిగ పలుచబడుతుందన్నట్లు, తెదేపాను కూడా కూటమిలో చేర్చుకొంటే దానికీ అధికారంలో వాటా పంచి ఇవ్వవలసి ఉంటుంది. పైగా అలాగా చేసినట్లయితే కొన ఊపిరితో ఉన్న తెదేపాను మళ్ళీ బ్రతికించినట్లవుతుంది. కనుక అందుకు కేసీఆర్ అంగీకరించకపోవచ్చును. ఒకవేళ తెలంగాణాలో తెదేపాతో బీజేపీ తెగతెంపులు చేసుకొన్నట్లయితే ఆ కారణంగా ఆంధ్రాలో కూడా తెదేపాతో తెగతెంపులు చేసుకొంటుందా లేదా అనేది చంద్రబాబు నాయుడుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీతో తెగతెంపులు చేసుకొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఇంకా దయనీయంగా మారవచ్చును కనుక బీజేపీతో పొత్తులు కొనసాగించడానికే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపవచ్చును.

ఒకవేళ తెలంగాణాలో తెరాస, బీజేపీలు చేతులు కలిపినట్లయితే దాని వలన బీజేపీకి పెద్దగా లాభం ఉండనప్పటికీ మళ్ళీ అదును చిక్కే వరకు రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా తనను తాను కాపాడుకోగలదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికయినా కోలుకోగలదో లేదో తెలియదు కానీ అంతవరకు తెరాసకు తోక పార్టీగానే మిగిలిపోకతప్పదు. ఒకవేళ తెలంగాణా నుండి తెదేపా పూర్తిగా తప్పుకొన్నట్లయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు కూడా మారుతాయి కనుక అంతిమంగా తెరాస తిరుగులేని రాజకీయ పార్టీగా ఎదగవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com