పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఆ మేరకు నివేదిక తయారు చేసి.. సమీక్షా సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో హెచ్చరికలు ఇప్పించారు. స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని… కిందిస్థాయి క్యాడర్ కు పదవులు వచ్చేలా చూడాలని ఆదేశిస్తే .. తమ బంధువులను గ్రామాల్లో సర్పంచ్‌లుగా నిలబెట్టారు. అది తేడా కొట్టింది.
ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సొంత గ్రామాలతో పాటు పార్టీకి పట్టు ఉన్న చాలా గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు. అధికారికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఖరారు చేసిన వారిని పట్టించుకోలేదు. తమ బంధువుల్ని.. తమ మాట వినేవారిని ఎంపిక చేసి వారికే మద్దతు ప్రకటించారు. కానీ పార్టీని నమ్ముకుని ఉన్నవారు మాత్రం.. విడిగా పోటీ చేశారు. రెబల్స్ ఎక్కువ మంది ఈ కారణంగానే విజయం సాధించారు. ప్రజల మద్దతు వారికే లభించింది. ఇలాంటి వారి లెక్క తీస్తే 18 మంది ఎమ్మెల్యేలు తేలారు.
వారి ట్రాక్ రికార్డులో ఈ అంశాన్ని నమోదు చేశారు. తప్పులు ఇలా చేసుకుంటూ పోతే మరోసారి ఆలోచించాల్సి ఉంటుందని వారికి మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. మరో వెయ్యి పంచాయతీలు అయినా కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిందని.. నియోజకవర్గ స్థాయి నేతల స్వార్థం, అధిపత్య పోరాటం కారణంగా.. ఆ సంఖ్య తగ్గిపోయిందని రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
