బులెట్ కి బులెట్ తోనే సమాధానం చెపుతాము: రాజ్ నాథ్ సింగ్

పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదుల దాడి తరువాత భారత్-పాక్ మధ్య మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ కుట్రకు పాల్పడినవారిని పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మోడీకి స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఆ సంఘటన జరిగి అప్పుడే రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు ఆ కుట్రదారులను పట్టుకోకుండా పాక్ తాత్సారం చేస్తోంది. ఆ కారణంగా రెండు దేశాల మధ్య ఇంకా ప్రతిష్టంభన నెలకొనే ఉంది. కానీ నేటికీ ఇరుదేశాలు ఈ వ్యవహారంలో మాటల తూటాలు పేల్చుకోకుండా చాలా సంయమనం పాటిస్తుండటం గమానార్హం. అంటే భారత్ ఇంకా పాక్ పట్ల సానుకూల దృక్పధంతోనే ఉందని, ఈ దాడి కారణంగా పాక్ తో మళ్ళీ తెగతెంపులు చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం అవుతోంది.

పాక్ కూడా ఈ కుట్రపై దర్యాప్తుకి మరో కమిటీని వేసినట్లు వార్తలు వచ్చేయి. ఇటువంటి వ్యవహారాలను ఏవిధంగా మెల్లగా అటక ఎక్కించాలో పాక్ కి బాగా తెలుసు. దాని నిబద్దత ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉంటోంది తప్ప ఏనాడు అది నిజాయితీగా వ్యవహరించిన దాఖలాలు లేవు. అయినప్పటికీ భారత్ నేటికీ చాలా సంయమనం పాటిస్తోంది. పఠాన్ కోట్ పై దాడి జరిగినప్పటి నుండి ఇంతవరకు కూడా పాక్ కి వ్యతిరేకంగా ఒక్క మాట తప్పుగా మాట్లాడకుండా చాలా జాగ్రత్తపడుతోంది.

ఈ కుట్రపై దర్యాప్తుకి నియమించిన పాక్ ఉన్నతాధికారుల కమిటీ పఠాన్ కోట్ కి వచ్చి దాడి జరిగిన ఎయిర్ బేస్ ప్రాంతాలలో కూడా దర్యాప్తు చేయాలనుకొంటోంది. భారత్ కి చాలా కీలకమయిన, వ్యూహాత్మకమయిన ఎయిర్ బేస్. కనుక అందులోకి పాక్ గూడచారి సంస్థ-ఐఎస్ఐ.ఉన్నతాధికారితో కూడిన ఆ కమిటీని దానిలోకి అనుమతించే అవకాశం లేనప్పటికీ, వారిని పఠాన్ కోట్ లో పరిమిత ప్రాంతాలలో దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని భారత్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ విషయాన్ని భారత్ ఇంకా దృవీకరించవలసి ఉంది. ఈ కేసులో పాక్ అనుసరిస్తున్న ద్వంద వైఖరి గురించి తెలిసి ఉన్నపటికీ, పాక్ దర్యాప్తు కమిటీని పఠాన్ కోట్ లో దర్యాప్తుకు అనుమతించినట్లయితే, అది భారత్ మెతక వైఖరికి అద్దం పడుతుందని విదేశీ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బహుశః అందుకు జవాబుగానే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మొన్న ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో ఖటిమాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “పాకిస్తాన్ మనపై కాల్పులు జరుపుతూ ఉంటే మనం వాళ్ళ తుపాకుల నుంచి వచ్చే తూటాలను లెక్కిస్తూ కూర్చోబోము. బుల్లెట్ కి బులెట్ తోనే సమాధానం చెపుతాము. అయితే మనవైపు నుండి మొదటి తూటా ప్రయోగించబడదు. కానీ అటువైపు నుంచి ఒక్క తూటా మన మీదకు వచ్చినా ఆ తరువాత మన వైపు నుండి వచ్చే తూటాల ప్రవాహాన్ని పాక్ నిలువరించలేదని చెప్పగలను,” అని అన్నారు.

పఠాన్ కోట్ పై దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ కి వ్యతిరేకంగా భారత్ చేసిన మొట్టమొదటి ఘాటయిన హెచ్చరిక ఇదేనని చెప్పవచ్చును. అయితే అది పాక్ పట్ల మోడీ ప్రభుత్వం చాలా మెతక వైఖరి ప్రదర్శిస్తోందనే విమర్శలకు జవాబు చెప్పడానికేనా లేక తమ సహనం నశిస్తోందని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకే ఆయన ఆ విధంగా మాట్లాడారో తెలియదు కానీ యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరిచిన పఠాన్ కోట్ పై జరిగిన దాడిపై ఏమీ చేయలేని నిస్సహాయత భారత ప్రభుత్వంలో కనిపిస్తోంది. క్రమంగా ఈ ఘటన కూడా ఉగ్రవాదుల దాడుల జాబితాలో చేర్చి, దానికీ ఒక సీరియల్ నెంబర్ ని ఇచ్చేసి ఇరుదేశాలు చేతులు దులుపుకొంటాయేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com